నాడు అశోకుడు .. నేడు కేసీఆర్
హరిత హారానికి సినీ నటుడు కృష్ణ కితాబు
రాయదుర్గం: నాడు అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటిం చినట్లు చరిత్రలో చదువుకున్నామని, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరితో, అంతటా మొక్కలు నాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రముఖ సినీనటుడు నటశేఖర కృష్ణ అన్నారు. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలో మంగళవారం తన సతీమణి విజయనిర్మల, నటుడు నరేష్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహరం పేరుతో మొక్కలు నాటే కార్యకమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.
ఇలాంటి పనుల్లో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ చెట్లు, పూలు, పచ్చదనం అంటే తనకు చాలా ఇష్టమని, తమ ఇంట్లో మూడు వందల రకరకాల మొక్కలు పెంచుతున్నామన్నారు. హరితహారం కార్యక్రమంలో సినీ నటులంతా పాల్గొంటున్నారన్నారు. నరేష్ మాట్లాడుతూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, హెచ్‌ఎం అనంత రాములు, జగన్ మోహన్, టీఆర్‌ఎస్ నాయకులు చోటంసింగ్, జంగయ్యయాదవ్, మల్లేష్, వినోద్ కుమార్, అనీల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.