దానమన్నా... ఏడున్నవే..!
కాంగ్రెస్ కార్యకర్తల ఎదురుచూపులు
పార్టీకి అండగా నిలిచేవారే లేరా అని ఆవేదన
బంజారాహిల్స్: ‘ఇక కదన రంగంలోకి దూకుతా.. రేపటి నుంచే దుమ్మురేపుతా.. ఒక్కొక్కరి పంచెలూడగొడతా...’ఇదీ పది రోజుల క్రితం మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ గర్జన. ఇక కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకొని అధికార విపక్ష పార్టీలకు చెమటలు పటిస్తుందని కార్యకర్తలు సంబురపడ్డారు. సంబరాలు చేసుకున్నారు.
మిఠాయిలు పంచుకున్నారు.. తీరా చూస్తే ఆయన ఇంత వరకు రంగంలోకి దిగకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మళ్లీ నిరాశ నిస్రృహల్లో మునిగిపోయారు. ఈ నెల 4వ తేదీన దానం నాగేందర్ తన నివాసంలోను, షబ్బీర్ అలీ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రేపటి నుంచే బస్తీల్లో పర్యటిస్తానని, సమావేశాలు ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. ఆ తెల్లవారే ఫిలింనగర్‌లోను, సోమాజిగూడలోను రెండు చోట్ల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి గట్టిగానే మాట్లాడారు.
ఆ తెల్లవారునుంచి కనిపించకుండాపోయారు. అన్ని డివిజన్లలో తిరుగుతారని భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నట్లు టీవీ చానెల్‌లో కనిపించడంతో కార్యకర్తలు సరిపెట్టుకున్నారు. తీరాచూస్తే నగరానికి వచ్చి కూడా సమావేశాల్లో పాల్గొనకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు. ఒక వైపు టీఆర్‌ఎస్, బీజేపీ జనంలోకి దూసుకెళ్తూ పట్టు పెంచుకుంటుంటే కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తున్నది.