‘బయట’ కొంటే బాదుడే
- బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్లపై సర్‌చార్జీ
- యూనిట్‌కు రూ.3 చొప్పున వడ్డించే యోచన
- ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్రాన్స్‌కో ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలు చేసే వినియోగదారులకు అదనపు సర్‌చార్జీ విధించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) నిర్ణయించింది. ఈ మేరకు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సమర్పించింది. ఈ అంశంపై తుది నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ట్రాన్స్‌కో వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా పారిశ్రామిక వినియోగదారులు, కొందరు బడా వినియోగదారులు ఒకవైపు డిస్కమ్‌లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, మరోవైపు బహిరంగ మార్కెట్‌లో కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిస్కంలు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నాయి.
ఏటా రూ.400 కోట్ల నష్టం: రాష్ట్రంలో దాదాపు 70కిపైగా పరిశ్రమలు, బడా సంస్థలు ఏటా రెండు వేల మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నాయి. దీంతో డిస్కంలకు ఏటా దాదాపు రూ.400 కోట్ల నష్టం వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా బహిరంగ మార్కెట్‌లో తక్కువ రేటు ఉన్నప్పుడల్లా పారిశ్రామిక వినియోగదారులు అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండటంతో డిస్కంలు నష్టపోతున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ డిమాండ్‌ను అనుసరించే డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు జెన్‌కోతో ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ ఒప్పందాలు 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఎంత మేరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయో.. అంత మొత్తం యూనిట్ల విద్యుత్తుకు డిస్కంలు జెన్‌కోకు డబ్బులు చెల్లించటం తప్పనిసరి. కానీ వినియోగదారులు బయటి మార్కెట్‌ను ఆశ్రయిస్తే అంత మేరకు డిస్కంల ఆదాయానికి గండి పడుతుంది.
నిరంతరాయంగా విద్యుత్: తెలంగాణ ఏర్పడిన తర్వాత డిస్కంలు నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నాయి. గతంలో ఉన్న పవర్ హాలిడేలను రద్దు చేసి, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నాయి. అందుకు భిన్నంగా పారిశ్రామిక వినియోగదారులు బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం డిస్కంలను షాక్‌కు గురి చేస్తోంది. రోజురోజుకూ ఈ నష్టం పెరిగిపోవటంతో డిస్కంలు ప్రత్యామ్నాయాలు ఆలోచించాయి. సమస్య నుంచి గట్టెక్కేందుకు బహి రంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేసే వారికి అదనపు సర్‌చార్జీ విధించాలని ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రభుత్వాలు అదనపు సర్‌చార్జీలను అమలు చేస్తున్నాయి. బయట నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా రూ.3 చొప్పున సర్‌చార్జీ విధిస్తున్నాయి. ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని ట్రాన్స్‌కో అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు.