సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంసీఐకి చెందిన నలుగురు వైద్యుల బృందంలో మెడికల్ కాలేజీలోని వసతిగృహాలు, ల్యాబోరేటరీలు, లైబ్రరీ, జిమ్, సెమినార్ హాళ్లతోపాటు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. పెంచిన మెడికల్ సీట్లకు అనుగుణంగా వసతులు, మౌళిక సదుపాయాలపై ఆరా తీశారు. కాలేజీ, ఆస్పత్రుల్లో ప్రాంగణాల్లో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయాలతోపాటు ఇన్‌షేషెంట్ వార్డులను పరిశీలించారు. ప్రతిరోజు జరిగే శస్త్రచికిత్సలు, జననాలు, మరణాలు, అవుట్ పేషెంట్లుకు చెందిన రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రి, కళాశాలల్లోని వసతులు, మౌళిక సదుపాయాలపై ఎంసీఐ వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్యులు, ట్యూటర్లు, సిబ్బంది కొరతపై కొంత మేర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటకీ రాష్ట్రాలు విడిపోయినా, వైద్యుల విభజన జరగలేదని, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది వైద్యులు, సిబ్బంది తెలంగాణకు రానున్నారని, అలాగే ఇక్కడి నుంచి మరికొంతమంది ఏపీకి వెళ్ల్లనున్నారని, త్వరలోనే సమస్య అధిగమిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ అధికారులు సర్ధిచెప్పినట్లు తెలిసింది. మంగళవారం కూడా ఎంసీఐ తనిఖీలు కొనసాగుతాయని గాంధీ కాలేజీ ప్రిన్సిపాల్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ మహేష్‌చంద్రలు తెలిపారు.