చివరి నిమిషం వరకూ సస్పెన్స్!
♦ నామినేషన్ ఉపసంహరణ రోజే అభ్యర్థులకు బీ-ఫారం
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ వ్యూహం
♦ విపక్షాలకు అంతుబట్టకుండా ఎత్తుగడ
♦ రెండు సభల్లో కేసీఆర్ ప్రసంగించే అవకాశం
♦ తెలంగాణేతరులకు కనీసం 15 సీట్లు
♦ డివిజన్లలో మొదలైన ఇంటింటి ప్రచారం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. ప్రతిపక్షాలకు అంతుపట్టకుండా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించినా, 100 డివిజన్లపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తమ అభ్యర్థుల జాబితాను చివరి నిమిషం దాకా వెల్లడించవద్దన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
నామినేషన్ల ఉపసంహరణ రోజే పార్టీ బీ-ఫారాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేశారని అంటున్నారు. మరోవైపు నగరంలో స్థిరపడిన తెలంగాణేతరులనూ బరిలోకి దింపే యోచనలో పార్టీ ఉందని, వీరికి కనీసం 15 సీట్లు కేటాయించే వీలుందంటున్నారు. ఇప్పటికే నగరంలో చేపట్టాల్సిన ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసిన గులాబీ దళం అప్పుడే ప్రచార క్షేత్రంలోకి దూకింది. నగరంలో నియోజకవర్గ సమావేశాలు మొదలుపెట్టింది. మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితలు ఆయా సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జిల్లా స్థాయి నాయకులు గ్రేటర్‌లోని ఆయా డివిజన్లకు చేరుకున్నారు.
గ్రేటర్‌లో ప్రకటించబోయే డివిజన్ల రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్ నాయకులకు కొంత స్పష్టత ఉందని, దీంతో ఆయా డివిజన్లలో అభ్యర్థులు ఎవరైతే గెలుపు అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని సర్వేల ద్వారా సేకరించినట్లు చెబుతున్నారు. వీరికి పాక్షికంగా కొంత సమాచారం ఇచ్చి ప్రచారం మొదలుపెట్టాలని సూచించినట్లు సమాచారం. అభ్యర్థుల పేరు మీదకంటే, పార్టీ ఎన్నికల గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్లాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ప్రచార నేతలకు సమాచారం
పార్టీ సీరియస్‌గా దృష్టి సారించిన వందకుపైగా డివిజన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఆయా ఇన్‌చార్జీలకు అందజే యనున్నారని చెబుతున్నారు. ఇందులో ఆయా డివిజన్లలో ప్రాబల్యం అధికంగా ఉన్న కులాలు, వర్గాలు, అక్కడి సమస్యలు, తక్షణం పరిష్కరించే వీలున్న సమస్యలు, ఇన్‌చార్జీలు ప్రచారంలో ఏం మాట్లాడాలి, ఎలాంటి హామీలు ఇవ్వాలి తదితర వివరాలను ఇవ్వనున్నారని తెలిసింది. డివిజన్ల రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూలుతో నిమిత్తం లేకుండా టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రచారం మొదలు పెట్టాయి.
ఇప్పటికే డివిజన్ కార్యాలయాలను ప్రారంభించిన నాయకులు, ముఖ్యంగా టికెట్లు ఆశిస్తున్న వారు ప్రచారంలో పాల్గొంటున్నారు. బుధవారం మెజారిటీ డివిజన్లలో పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం కూడా మొదలుపెట్టాయి. ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు ప్రతీ వెయ్యి మంది ఓటర్లకు ఒక నాయకునికి కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. గ్రేటర్ ప్రచారంలో మంత్రులంతా విస్తృతంగా పాల్గొనేలా ప్రణాళిక రూపొందించిన టీఆర్‌ఎస్.. తమ అధినేత, సీఎం కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. నగరంలో రెండు బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి.