హిందుత్వం మతం కాదు.. ధర్మం
- స్వామి పరిపూర్ణానంద స్వామి
నాంపల్లి: హిందుత్వం అనేది మతం కాదని, అదొక ధర్మమని శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. శనివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో సమాచార భారతి-హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శత జయంతిని పురస్కరించుకుని ‘భారత్ అంటే...? అనే అంశంపై జర్నలిస్టులకు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వామి పరిపూర్ణానంద ఆశీర్వచన ప్రసంగం చే స్తూ.. దేశానికి మనం రెండు పేర్లను మోసున్నట్లు చెప్పారు. రాజ్యాంగంలోనే ఇండియా, భారత్ అనే రాసుకున్నామని గుర్తు చేశారు. ఇండియా అనే పేరు కావాలా..? లేక భారత్ అనే పేరు కావాలో మనందరికి స్పష్టత కావాలని కోరారు. ప్రధానమంత్రి సహా అందరూ మేకిన్ ఇండియా కాదు.. మేకిన్ భారత్ ఉచ్ఛరించాలని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ప్రధానమైనది అసహనం అన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్న వారందరూ చదువుకున్న రాక్షసులే అన్నారు. ‘చేద్దాం...చూద్దాం’ అనే జిడ్డు మేధావులు, అసహనంతో ఉండే మేధావులతో దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు.
అసహనం అనేది పెద్ద జబ్బు అన్నారు. దీనికి చికిత్స చేయకుంటే ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. అసహనానికి ప్రధానమంత్రే పరిష్కారం చూపాలని కోరారు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పబడే మీడియా సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. యథార్థాన్ని సమాజానికి అందించడమే జర్నలిజం అవుతుందని అన్నారు. సమాచారాన్ని యథాతథంగా అందించాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందన్నారు. సెక్యులరిజం అనే పదాన్ని రాజకీయ పార్టీలు వక్రీకరిస్తూ... చమత్కరిస్తూ వాడుతున్నాయని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా వర్క్ చేసే కోటరీలు అవే ఉంటాయని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం అసంబద్ధులకు పద్మ అవార్డులను ప్రదానం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.రామచంద్రరాజు, అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి బి.సురేంద్ర, ఢిల్లీ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ భజరంగ్‌లాల్ గుప్త, కార్యక్రమ కన్వీనర్, జర్నలిస్టు జి.వల్లీశ్వర్ పాల్గొన్నారు.
- సదస్సులో మాట్లాడుతున్న స్వామి పరిపూర్ణానంద స్వామి