swami paripurnanda swami
-
ప్రచార వేడి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్‌లలో ప్రచారం నిర్వహించనున్నారు. గ్రూపు రాజకీయాలకు వేదికైన కాంగ్రెస్ పార్టీలో ప్రచారం సైతం అదే రీతిన సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క హెలికాప్టర్ ద్వారా ఆసిఫాబాద్, సిర్పూరులలో ప్రచారం నిర్వహించిపోగా, తాజాగా ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు జరపనున్నారు. రేవంత్ ప్రచారం చేసే మూడు స్థానాలు కూడా తన వర్గంగా ఉన్న అభ్యర్థుల కోసమే కావడం గమనార్హం. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసిఫాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు నిర్వహిస్తున్న ప్రచార సభలో పాల్గొంటారు. ఇక్కడ రోడ్‌షోతో పాటు బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బోథ్ నియోజకవర్గంలో తనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడినుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు ఖానాపూర్‌లో సాగే బహిరంగసభలో పాల్గొననున్నారు. ఖానాపూర్, బోథ్‌లలో ఈనెల 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మూడు చోట్ల ఏర్పాట్లు చేపట్టారు. పశ్చిమాన అమిత్‌షా... తూర్పున పరిపూర్ణానంద భారతీయ జనతాపార్టీ ఎన్నికల ప్రచారానికి ఆకర్షణలను అద్దుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల ప్రచారం ఖరారు కాగా, ఆదివారం మధ్యాహ్నం నిర్మల్ రాబోతున్నారు. ముక్కోణపు పోటీ నెలకొన్న నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి సువర్ణరెడ్డి తరుపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈనెల 28న ఆదిలాబాద్‌లో పాయల్ శంకర్ ఎన్ని కల ప్రచార సభలో పాల్గొంటారు. అమిత్‌షా ప్రచార సభ జరుగుతున్న సమయంలోనే మంచిర్యాల, సిర్పూరు, చెన్నూర్ నియోజకవర్గాలకు ఇటీవలే పార్టీలో చేరిన స్వామి పరిపూర్ణానంద విచ్చేస్తున్నారు. లక్సెట్టిపేట, చెన్నూర్, కాగజ్‌నగర్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సభల కోసం ప్రత్యేక హెలికాప్టర్లో నేతలు రానున్నారు. ఈ మేరకు నిర్మల్, లక్సెట్టిపేట, కాగజ్‌నగర్‌లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
హిందూ ద్రోహి సీఎం చంద్రబాబు!
కడప కల్చరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిందూ ద్రోహిగా మారాడని వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రహదారుల నిర్భంద కార్యక్రమాన్ని అమలు కాకుండా పోలీసులు ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. సాయంత్రం ఆయన పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాను రాను మతాల మధ్య చిచ్చుపెడుతూ హిందు మత ద్రోహిగా మారుతున్నాడని దుయ్యబట్టారు. సమస్యకు కారణమైన వారిని వదిలి ధర్మాగ్రహం వ్యక్తం చేసిన పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడం ఏం న్యాయమో ఆయనే చెప్పాలన్నారు. హిందూ దేశంలో ప్రజలు విశ్వసించే ధర్మాలకు ప్రమాదం వాటిల్లుతోందని మనం హిందూ దేశంలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. సంఘ విద్రోహశక్తిగా మారుతున్న సీఎం చంద్రబాబును రానున్న ఎన్నికల్లో మట్టి కరిపించేందుకు హిందువులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హిందూ ద్రోహి చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడే సమ యం ఆసన్నమైందని హెచ్చరించారు. పోలీసులు రామకృష్ణారెడ్డితోపాటు బీజేపీ నాయకుడు బైరెడ్డి మధుసూదన్, పెసల సాంబశివారెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కిస్టిపాటి వెంకట్రామిరెడ్డి, ఆగ్రోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చెన్నక్రిష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నళ్లోల్ల రాజారాం, బిజేపీ ఓబీసీ సంఘం అధ్యక్షుడు దుర్గం దస్తగిరి తదితరులు అరెస్టు చేశారు. -
హిందుత్వం మతం కాదు.. ధర్మం
- స్వామి పరిపూర్ణానంద స్వామి నాంపల్లి: హిందుత్వం అనేది మతం కాదని, అదొక ధర్మమని శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. శనివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో సమాచార భారతి-హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శత జయంతిని పురస్కరించుకుని ‘భారత్ అంటే...? అనే అంశంపై జర్నలిస్టులకు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వామి పరిపూర్ణానంద ఆశీర్వచన ప్రసంగం చే స్తూ.. దేశానికి మనం రెండు పేర్లను మోసున్నట్లు చెప్పారు. రాజ్యాంగంలోనే ఇండియా, భారత్ అనే రాసుకున్నామని గుర్తు చేశారు. ఇండియా అనే పేరు కావాలా..? లేక భారత్ అనే పేరు కావాలో మనందరికి స్పష్టత కావాలని కోరారు. ప్రధానమంత్రి సహా అందరూ మేకిన్ ఇండియా కాదు.. మేకిన్ భారత్ ఉచ్ఛరించాలని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ప్రధానమైనది అసహనం అన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్న వారందరూ చదువుకున్న రాక్షసులే అన్నారు. ‘చేద్దాం...చూద్దాం’ అనే జిడ్డు మేధావులు, అసహనంతో ఉండే మేధావులతో దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. అసహనం అనేది పెద్ద జబ్బు అన్నారు. దీనికి చికిత్స చేయకుంటే ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. అసహనానికి ప్రధానమంత్రే పరిష్కారం చూపాలని కోరారు. ఫోర్త్ ఎస్టేట్‌గా చెప్పబడే మీడియా సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు. యథార్థాన్ని సమాజానికి అందించడమే జర్నలిజం అవుతుందని అన్నారు. సమాచారాన్ని యథాతథంగా అందించాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందన్నారు. సెక్యులరిజం అనే పదాన్ని రాజకీయ పార్టీలు వక్రీకరిస్తూ... చమత్కరిస్తూ వాడుతున్నాయని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా వర్క్ చేసే కోటరీలు అవే ఉంటాయని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం అసంబద్ధులకు పద్మ అవార్డులను ప్రదానం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.రామచంద్రరాజు, అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి బి.సురేంద్ర, ఢిల్లీ యూనివర్శిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ భజరంగ్‌లాల్ గుప్త, కార్యక్రమ కన్వీనర్, జర్నలిస్టు జి.వల్లీశ్వర్ పాల్గొన్నారు. - సదస్సులో మాట్లాడుతున్న స్వామి పరిపూర్ణానంద స్వామి