అరెస్టైన వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, తదితర నాయకులు
కడప కల్చరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిందూ ద్రోహిగా మారాడని వీహెచ్‌పీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రహదారుల నిర్భంద కార్యక్రమాన్ని అమలు కాకుండా పోలీసులు ముందస్తుగా గృహ నిర్భందం చేశారు. సాయంత్రం ఆయన పోలీసు స్టేషన్ నుంచి విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాను రాను మతాల మధ్య చిచ్చుపెడుతూ హిందు మత ద్రోహిగా మారుతున్నాడని దుయ్యబట్టారు. సమస్యకు కారణమైన వారిని వదిలి ధర్మాగ్రహం వ్యక్తం చేసిన పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడం ఏం న్యాయమో ఆయనే చెప్పాలన్నారు.
హిందూ దేశంలో ప్రజలు విశ్వసించే ధర్మాలకు ప్రమాదం వాటిల్లుతోందని మనం హిందూ దేశంలోనే ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. సంఘ విద్రోహశక్తిగా మారుతున్న సీఎం చంద్రబాబును రానున్న ఎన్నికల్లో మట్టి కరిపించేందుకు హిందువులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హిందూ ద్రోహి చంద్రబాబు పాలనకు చరమ గీతం పాడే సమ యం ఆసన్నమైందని హెచ్చరించారు. పోలీసులు రామకృష్ణారెడ్డితోపాటు బీజేపీ నాయకుడు బైరెడ్డి మధుసూదన్, పెసల సాంబశివారెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కిస్టిపాటి వెంకట్రామిరెడ్డి, ఆగ్రోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చెన్నక్రిష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నళ్లోల్ల రాజారాం, బిజేపీ ఓబీసీ సంఘం అధ్యక్షుడు దుర్గం దస్తగిరి తదితరులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment