‘కేసీఆర్ కు హరీష్ భయం’
‘కేసీఆర్ కు హరీష్ భయం’
Published Mon, Nov 7 2016 12:24 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సీఎం కావాలనే ఆలోచనతోనే సచివాలయాన్ని కూల్చివేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని టీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు సీఎం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పుడు హరీష్ సీఎం అవుతారేమోననే భయం కేసీఆర్ కు పట్టుకుందని.. అందుకోసమే వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చాలనుకుంటున్నారని తెలిపారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సచివాలయం తరలింపును నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని టీపీసీసీ నేతలు సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టాలనే నిర్ణయం సరికాదన్నారు. కూల్చివేయడంపై జోక్యం చేసుకోవాలని నేతలు గవర్నర్ ను కోరారు. వాస్తు దోషం ఉందనే సాకుతోనే సచివాలయం కూల్చివేయాలనుకుంటున్నారన్నారు. కానీ హైకోర్టు కు మాత్రం ఫైర్ సేఫ్టీ లేదనే కారణం చూపుతున్నారని ఆరోపించారు. సచివాలయం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో నేతలు పేర్కొన్నారు. గవర్నర్ కలిసినవారిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement