వాణిజ్య అవకాశాలను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్ : ఇరు ప్రాంతాల నడుమ వాణిజ్య సంబంధాలకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు తమ దేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని పోలండ్ రాయబారి తోమస్జ్ లుకస్జక్ ఆహ్వానించారు. లుకస్జక్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 5, 6 తేదీల్లో బెంగళూరులో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘బారత్- మధ్య యూరోప్ వాణిజ్య సదస్సు’ రెండో విడత ఏర్పాట్లలో భాగంగా ఈ భేటీ జరిగింది.
భారత్‌తో తాము ఏటా రెండు బిలియన్ల డాలర్ల విలువైన వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు లుకస్జక్ వెల్లడించారు. గృహోపకరణాలు, టెలివిజన్ల తయారీలో పోలండ్ ప్రపంచంలోనే అగ్రగామిగా వుందన్నారు. దీంతో జపాన్, కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థలు పోలండ్‌లో పరిశోధన, అభివృద్ధి సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. వ్యవసాయం, ఫర్నిచర్, మైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్ రంగాల్లో పోలండ్ ప్రతినిధుల బృందం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వివరించింది.
అక్కడున్న నైపుణ్య మానవ వనరులు, సరళీకృత విధానాలకు ఆకర్షితులై భారతీయులు కూడా పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ఆ బృందం ప్రస్తావించింది. తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం ప్రత్యేకతలను మంత్రి జూపల్లి పోలండ్ బృందానికి వివరించారు. ఇరు ప్రాంతాల నడుమ పెట్టుబడులకున్న అనుకూలతలు, మానవ వనరులు తదితరాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ లుకస్జక్ బృందం భేటీ జరిపింది. ఇక్కడి అవకాశాలు, పారిశ్రామిక విధానంపై రాజీవ్ శర్మ పోలండ్ బృందానికి వివరించారు.
పోచారంతో పోలండ్ రాయబారి భేటీ
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్‌లో పోలండ్ రాయబారి థామస్ లుకాజుక్ తెలిపారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆయన భేటీ అయ్యారు. గతంలో అమూల్ పాల ఉత్పత్తి సంస్థలో పెట్టుబడులు పెట్టామని, పన్నీర్, వెన్న తయారీకి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించామని పేర్కొన్నారు.
పోలండ్‌లో వ్యవసాయం, నీటి వనరుల సంరక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వ కృషి తదితర వివరాలను మంత్రికి వివరించారు. కాగా, నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఏర్పాటు చేసిన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల పోలండ్ రాజధానిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు.