
టీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోండి
అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. గవర్నర్‌కు టీటీడీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ చేస్తున్న అప్రజాస్వామిక, రాజ్యాంగ ఉల్లంఘనలపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ టీడీపీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరింది. అర్హులైన ఓటర్లను తొలగించడం మొదలుకొని ప్రచారం వరకు రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్, ఎం.అరవింద్ కుమార్ గౌడ్, ఎం.అమరనాథ్ బాబు తదితరులు సోమవారం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి, ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా చూడాలని కోరారు.
ఎదురుతిరిగిన వారిపై దాడులు: ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డిపై పోటీ చేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి తలారి సత్యం అనుమానాస్పద మరణంపై విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. అలాగే గతంలో స్పీకర్ మధుసూదనాచారి అనుచరులు కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను బెదిరించారని, ఎమ్మెల్సీ సలీం శంషాబాద్ తహసీల్దార్‌ను బెదిరించడం, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, మంత్రి జగదీశ్‌రెడ్డిలు కూడా అధికారులను, విలేకరులను వేధించారని ఆరోపించారు.