ధ్రువపత్రాలు తీసుకున్న సురేశ్ ప్రభు, సుజనా, టీజీ
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తా: సురేశ్ ప్రభు
- విభజన హామీల అమలుకు ప్రయత్నిస్తాం: టీజీ, సుజనా
- నేడు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం సమక్షంలో చర్చించనున్న రైల్వే మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు (బీజేపీ), వై.సత్యనారాయణచౌదరి (టీడీపీ), టీజీ వెంకటేశ్ (టీడీపీ)లు శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. ఎన్నికల అధికారి, ఏపీ శాసనసభ ఇన్‌చార్జ్ కార్యదర్శి కె. సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు వీరికి ధ్రువపత్రాలు అందజేశారు. ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేయగా వైఎస్సార్‌సీపీ డమ్మీ అభ్యర్ధి సునందారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవటంతో నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లైంది.
తొలుత ధ్రువపత్రం తీసుకున్న సురేశ్ ప్రభు వెంట కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కంతేటి సత్యనారాయణ రాజు తదితరులున్నారు. ఆ తరువాత సుజనా, టీజీ ధ్రువపత్రాలు తీసుకున్నారు. వీరి వెంట ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఏపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు తదితరులున్నారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ ఏపీ నుంచి ఎన్నిక కావటం సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
సుజనా, టీజీ మాట్లాడుతూ విభ జన హామీలు అమలుకు కృషి చేయటంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతకు ముందు ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఇచ్చిన విందులో వీరందరూ పాల్గొన్నారు. ఎన్నికల ధ్రువపత్రం తీసుకున్న అనంతరం ప్రభు తిరుమల వెళ్లారు. అక్కడ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శనివారం ఉదయం విజయవాడ చేరుకుంటారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఏపీ పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై చర్చిస్తారు. ఆ తరువాత విజయవాడలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వి. విజయసాయిరెడ్డి ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉంది.