జైల్లో వేసైనా ప్రాజెక్టులు కడతాం
అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోం: తలసాని
సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రాజెక్టులు అడ్డుకుంటామంటే లోపలేసి తీరుతాం. ఇప్పుడు అరెస్టులు చేసి వదిలేస్తున్నాం. రేపు కేసులు పెట్టి జైలుకు కూడా పంపిస్తాం. ప్రభుత్వం చేతు లు కట్టుకుని కూర్చోదు. తాటాకు చప్పుళ్లకు భయపడం.ఆరునూరైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం’’ అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రతిపక్షాలను హెచ్చరించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులు కట్టొద్దా, రైతులు బాగుపడొద్దా? అని ప్రశ్నించారు. టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. ఏపీలో బందరు పోర్టుకు 5వేల ఎకరాలన్నార ని, విజయనగరం ఎయిర్‌పోర్టు అంశం వివాదంగా మారిందని.. అక్కడొక డ్రామా ఇక్కడొక డ్రామానా అని నిలదీశారు.
మేజర్ ప్రాజెక్టులను నిర్మించాల్సి వస్తే కొంత నష్టం ఉంటుందని, బాధితులకు ఇబ్బంది ఉంటుందన్నారు. కానీ వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామా కంపెనీలు ఏ ర్పాటు చేసుకొని నాట కాలాడుతున్నాయని.. వారికి రైతుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందన్నారు. బీజేపీ కూడా ఇక్కడొక డ్రామా.. మరోచోట మరో డ్రామా ఆడుతోందన్నారు. ఇలా చేస్తే ఆ పార్టీలు 20 ఏళ్లు అడ్రస్ లేకుండా పోతాయన్నారు. ప్రజలు చిల్లర రాజకీయ నాయకుల భ్రమలో పడొద్దని.. మల్లన్నసాగర్ రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులపై లాఠీచార్జి అనేది చెదరగొట్టే ప్రయత్నమేనని.. కక్షగట్టి ఎవరినీ కొట్టలేదన్నారు.
కాంగ్రెస్‌లో ఉన్న 15 మందిలో ప్రతిఒక్కరూ సీఎం అభ్యర్థులే కనుక ఆ పార్టీలో మనిషికో విధా నం ఉంటుందని ఎద్దేవా చేశారు. కోదండరాం ఏ పార్టీకీ చెందినవారు కాదని, ఆయన ప్రజాప్రతినిధి కూడా కాదని.. ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంద న్నారు. ఇక రైతులను లక్ష్యంగా చేసుకొని లాఠీచార్జి చేయడంపై పరిశీలిస్తామన్నారు.