ప్రాజెక్టుల ప్యాకేజీపై చర్చకు రావాలి
ప్రభుత్వానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే ప్రాజెక్టుల నిర్వాసితులకిచ్చే ప్యాకేజీపై చర్చకు రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. గురువారం ఎంబీ భవన్‌లో పార్టీ నాయకులు చుక్క రాములు, టి.జ్యోతితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. భూమి కోల్పోయే వారికి అద్భుతమైన ప్యాకేజీ ఇస్తున్నామని, ఇది భూసేకరణచట్టం 2013 కంటే ఎన్నో రెట్లు మెరుగైనదని ప్రభుత్వం చేస్తున్న వాదన అంశాల వారీగా ఏ విధంగా సరికాదో వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రభుత్వం తెచ్చిన జీవో 123 వల్ల కొందరికే మేలు జరుగుతుందనీ మిగతా వారికి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుందన్న విషయాన్ని ప్రభుత్వం మరుగుపరుస్తోందన్నారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పోరాటసమితి ఆధ్వర్యంలో తాను పాదయాత్రను చేపడుతున్నట్లు తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. శుక్రవారం ఉదయం కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామంలో పాదయాత్రను ప్రారంభించి, 4న ఏటిగడ్డ కిష్టాపురంలో పాదయాత్రను ముగిస్తామన్నారు.