లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా పోరాటం | Target of one lakh jobs fight | Sakshi
Sakshi News home page

లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా పోరాటం

Published Fri, Jun 3 2016 12:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా పోరాటం - Sakshi

లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా పోరాటం

ఓయూలో సొంత ఖర్చులతో అమరుల స్థూపం
తెలంగాణలో సీమాంధ్ర అధికారులా?
నాటి ద్రోహులకు... నేడు మంత్రి పదవులా?
సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి

 

సిటీబ్యూరో: ‘పన్నెండు గంటల్లో నాలుగు కోట్ల మంది వివరాలు సేకరించిన మీరు తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి వివరాలు సేకరించ లేదంటే ఇంతకన్న ఘోరం మరేదైనా ఉందా? ఉస్మానియా బిడ్డలను వీరులు, శూరులన్నారు. ఆయన మాటలు విని ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. చనిపోయిన వారికి రూ.10 లక్షలు, కుటుంబానికి ఒక ఉద్యోగం, ఉండటానికి ఇళ్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని సూచించాం. కేసుల పాలైన విద్యార్థులను తెలంగాణ పోరాట యోధులుగా గుర్తించాలని కోరాం. వారికి ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరాం. వీటిలో ఏ ఒక్కటీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఆర్ట్స్ కళాశాల వద్ద జనజాతర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాధించుకుంది కేసీఆర్‌ను సీఎంను చేయడానికో, హరీష్, కేటీఆర్‌లను మంత్రులను చేయడానికో కాదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం కోసం తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. లక్ష ఉద్యోగాలే లక్ష్యంగా విద్యార్థులతో కలిసి పోరాడుతానని చెప్పారు. భవిష్యత్తులో తాను అధికారంలోకి వస్తే టీఎస్‌ను టీజీగా మారుస్తానని చెప్పారు. తెలంగాణ బిడ్డగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

 
గజ దొంగల చేతిలో పెట్టినట్లైంది...

విద్యార్థుల వీరోచిత పోరాటాలు..ఎంతో మంది ఆత్మ బలిదానాలు..అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబం ఊరేగుతోందని ఘాటుగా విమర్శించారు. దొంగల చేతుల నుంచి గుంజుకుని గజ దొంగల చేతిలో పెట్టినట్లు ఉంది... రెండేళ్లలో రెండు లక్షల కోట్ల విలువ చేసే టెండర్లు పిలిచారు. వీటిలో రూ.192 వేల కోట్ల రూపాయల టెండర్లు సీమాంధ్రులకు అప్పగించారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రాజెక్టులు ఆంధ్రావాళ్లకు కట్టబె ట్టడానికేనా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో ప్రాణాలను పణంగా పెట్టిన వీరులను కాదని ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు మంత్రి పదవులు, డీఎస్‌కు రాజ్యసభ సీటు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. ఇది తెలంగాణ అమర వీరులను అవ మానించడం కాదా అని ప్రశ్నించారు.  ఇదిలా ఉంటే సభకు హాజరయ్యేందుకు వర్సిటీకి చేరుకున్న కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబులను పోలీసులు ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ వద్దే అడ్డుకుని అరెస్ట్ చేశారు. బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమ వేదిక చైర్మన్ చెరుకు సుధాకర్, టీడీపీ నాయకుడు రాజారాం యాదవ్, విద్యార్థి జేఏసీ చైర్మన్ కళ్యాణ్, దరువు ఎల్లన్న, పుల్లారావు యాదవ్, బాలలక్ష్మి, చారుకొండ వెంకటేశ్, ఆంజనేయులు, శివప్రసాద్, మందాల భాస్కర్, దుర్గం భాస్కర్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 
కేసీఆర్ పాలనకు చరమగీతం తప్పదు

ఓయూ విద్యార్థుల ఉద్యమాలతోనే సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుతామని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కళ్యాణ్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను విస్మరించడమే కాకుండా రాష్ట్రంలో విద్యార్థి, ప్రజా వ్యతిరేక  విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్‌కు విద్యార్థి లోకం త్వరలోనే బుద్ధి చెబుతుందన్నారు. ప్రజలకు, విద్యార్థులకు గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రాణాత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందించలేదన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నేతలు పుల్లారావ్‌యాదవ్, చారకొండ వెంకటేష్, బాలలక్ష్మీ, రాజారామ్‌యాదవ్,  బాబులాల్‌నాయక్,  మధుసూదన్‌రెడ్డి, సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement