
తండ్రితో కలిసి విచారణకు వచ్చిన తరుణ్
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు అందుకున్న తరుణ్ విచారణకు హాజరయ్యారు. తండ్రి చక్రపాణితో కలిసి ఆయన ఉదయమే సిట్ కార్యాలయానికి బయల్దేరి వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. నేడు (శనివారం) తరుణ్ విచారణ జరగనుంది.
ఈ నేపథ్యంలో తరుణ్ బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లోగల తన ఇంటి నుంచి తండ్రితో కలిసి ఓ గుడికి వెళ్లి అక్కడి నుంచి విచారణకు హాజరయ్యేందుకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ మాఫియాతో లింకులు, గతంలో డగ్స్ తీసుకున్నారా తదితర ప్రశ్నలను సిట్ అధికారులు తరుణ్ కోసం సిద్ధం చేశారు. గతంలో పబ్ నిర్వహించిన తరుణ్ ప్రస్తుతం దానిని కొనసాగిస్తున్నారా లేదా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి ఉదయం 10గంటల తర్వాత తరుణ్ విచారణ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది.