‘ప్రీమియం’ దోపిడి
సాక్షి, సిటీబ్యూరో: ఉన్న పథకానికే కొత్త పేరు... ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తున్నట్టు ప్రకటనలు. అసలుకు ఎసరు. అడ్డదారిలో డబ్బులు పోగేసుకునే వ్యూహం. ఇదీ రైల్వే అధికారుల తీరు. ప్రీమియం రైళ్ల పేరుతో కొత్త తరహా బెర్తుల బేరానికి దిగిన దక్షిణ మధ్య రైల్వే తత్కాల్ టిక్కెట్‌లనూ వదిలిపెట్టడం లేదు. వాటిని ‘ప్రీమియం’ రూట్‌కు మళ్లించింది.
ప్రయాణికుల రద్దీ, డిమాండ్ బాగా ఉన్న ఏడు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇటీవల ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’ చార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఈ చార్జీలు ఒకటికి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులకు భారంగా మారాయి. మిగిలిన రైళ్ల లాగానే తత్కాల్ కోటాలోనే కోత విధించి...‘ప్రీమియం తత్కాల్’ పేరిట దోపిడీకి దిగడం గమనార్హం. జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏడు ప్రధాన రైళ్లలో ప్రవేశపెట్టిన ప్రీమియం తత్కాల్ టిక్కెట్‌లను మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విస్తరించే దిశగా దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం ఏపీ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, దక్షిణ్, గోదావరి, బెంగళూర్, శబరి, పాట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రీమియం తత్కాల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లలోని తత్కాల్ టిక్కెట్‌లకు కోత పెట్టి 50 శాతం ప్రీమియం తత్కాల్ కిందకు మార్చేశారు. దీంతో ప్రయాణికులు రెట్టింపు మొత్తం చెల్లించవలసి వస్తోంది. మొదట్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే రూట్‌లలో ప్రత్యేక రైళ్ల (సాధారణ చార్జీలే ఉంటాయి) స్థానంలో ప్రీమియం రైళ్లను (రెట్టింపు చార్జీలు) ప్రవేశపెట్టారు. సెలవులు,పండుగలు వంటి ప్రత్యేక రోజుల్లో రద్దీని బట్టి ప్రీమియం రైళ్లను నడిపే అధికారులు... ప్రస్తుతం రద్దీతో నిమిత్తం లేకుండా రెగ్యులర్ రైళ్లలో సైతం తత్కాల్ టిక్కెట్‌లను ప్రీమియంతో ముడిపెట్టడం విశేషం.
కోటాకు టాటా...
అన్ని రైళ్లలోనూ ఫస్ట్‌క్లాస్, సెకెండ్ ఏసీ, థ ర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలలో 30 శాతం చొప్పున తత్కాల్ టిక్కెట్‌లు ఉంటాయి. ఒక స్లీపర్ క్లాస్ బోగీలో సాధారణంగా 72 బెర్తులు ఉంటాయి. వాటిలో 22 తత్కాల్‌కుకేటాయిస్తారు. సాధారణ చార్జీల కంటే తత్కాల్‌పైరూ.100 నుంచి రూ.150 అధికంగా ఉంటుంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్లీపర్ క్లాస్ రూ.475 ఉంటే ... తత్కాల్‌లో అది రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
అలా ప్రతి రైలులోనూ అన్ని తరగతులతో కలిపి సుమారు 300 బెర్తులకు అదనపు చార్జీలతో 24 గంటల ముందుగా బుక్ చేసుకొనే అవకాశం ఉంది. రెండు నెలల క్రితం ప్రవేశపెట్టిన ‘తత్కాల్ ప్రీమియం’తో... అసలైన తత్కాల్ కోటాకు సగం వరకూ కోత పడింది. అదే సమయంలో చార్జీలు 10 నుంచి 20 శాతం పెరిగాయి. దీనివల్ల ప్రయాణికులపై మరింత భారం పెరిగింది.
ఇక్కడ ఎంతో నేర్చుకోవచ్చు
నాంపల్లి: ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ పౌర సంబంధాల నమూనా లేనప్పటికీ భారతదేశంలో పీఆర్ వ్యవస్థ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని గ్లోబల్ అలయన్స్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్ చైర్మన్ గ్రేగర్‌ఆఫ్ అన్నారు. మంగళవారం రాత్రి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘గెటింగ్ టు లీడర్ షిప్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, వియత్నాంలోనూ ఉత్తమ పీఆర్ నమూనాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ రిలేషన్స్ వాయిస్ ఎడిటర్ డాక్టర్ సి.వి.నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ కె.నరేంద్ర, డాక్టర్ జె.చెన్నయ్య పాల్గొన్నారు.