
టీడీపీ ప్రచార సారథి లోకేష్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రచారకుడిగా ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వ్యవహరించనున్నారు.
► 24 నుంచి ‘గ్రేటర్’ఎన్నికల ప్రచారం
► చంద్రబాబు ప్రచారంపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రచారకుడిగా ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ వ్యవహరించనున్నారు. సెటిలర్లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా లోకేష్‌తో వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించేలా చంద్రబాబు తెలంగాణ నేతలకు మార్గదర్శనం చేశారు.
‘గ్రేటర్’ ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ 92 సీట్లలో పోటీ చేస్తోంది. ఫిబ్రవరి 2న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమం ఈనెల 31తో ముగుస్తుంది. దీంతో మిగిలిన తొమ్మిది రోజుల్లో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమానికి గాను ఈనెల 24వ తేదీ నుంచి లోకేష్ ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. 31వ తేదీ వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రూపొందిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్ల తెలంగాణ ఓట్లు రావని బీజేపీ భయపడుతుండడంతో ఆ బాధ్యతలను లోకేష్‌కే అప్పజెప్పనున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 28,29,30 తేదీల్లో చంద్రబాబు రోడ్‌షోలు ఉండాలి. కానీ బీజేపీ అభ్యంతరాలు, తెలంగాణ ఓటర్ల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని బాబు ప్రణాళిక మారే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.
కింగ్‌మేకర్ అవుతాం: లోకేష్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో టీడీపీ అభ్యర్థులతో లోకేష్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రచార సీడీలను కూడా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈనెల 24 నుంచి 31 వరకు తాను ప్రచారంలో పాల్గొననున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ కింగ్‌మేకర్ అవుతుందన్నారు. టీడీపీ-బీజేపీ కూటమి విజయం తథ్యమని, ప్రజలు తమ పక్షానే ఉన్నారన్నారు. ప్రజలు సీఎం కేసీఆర్‌ను నమ్మడం లేదని, అందుకే మంత్రి కేటీఆర్‌ను ప్రచారంలో ముందుకు తెచ్చారన్నారు. కేటీఆర్ వంద డివిజన్‌లు గెలుస్తామని చేసిన సవాల్‌కు రేవంత్‌రెడ్డి స్పందించారని, వంద గెలవకపోతే మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, ఆర్. కృష్ణయ్య, మాజీ మంత్రులు ఉమా మాధవరెడ్డి, పి. రాములు, తెలుగుయువత అధ్యక్షుడు టి. వీరేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.