
బలం లేకున్నా బరిలోకి
- రాజ్యసభ ఎన్నికలపై టీడీపీ నిర్ణయం
- నాలుగో అభ్యర్థిని పోటీ పెట్టే యోచన
- మరికొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే యత్నాలు
- సీటు కోరిన బీజేపీ... అంగీకరించిన చంద్రబాబు
- రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పోటీ చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: గెలుపున కు అవసరమైన బలం లేకపోయినా నాలుగో అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టాలని తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. విజయవాడలో సోమవారం జరిగే పొలిట్ బ్యూరో, వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో చర్చ అనంతరం ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేయనుంది. పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో చంద్రబాబు ఆదివారం రాత్రి తిరుపతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను నేతలు చంద్రబాబుకు కట్టబెట్టారు. ఈ మేరకు ఆయన సోమవారం విజయవాడలో పొలిట్‌బ్యూరో, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతారు.
నాలుగో రాజ్యసభ సీటును కూడా గెలుచుకోవాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంకా అవసరమవుతారో చంద్రబాబు ఆదివారం సమావేశంలో చర్చించారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని పొలిట్‌బ్యూరో సభ్యులు స్పష్టం చేశారు. అయినా వెనక్కు తగ్గవద్దని, ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వారి ద్వారా మరో 15 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి నాలుగో సీటు కూడా దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
టీడీపీకీ ప్రస్తుతం ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం మాత్రమే ఉంది. నాలుగో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే తప్పకుండా ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహించాలి. వాటిని ప్రోత్సహించేందుకే నాలుగో అభ్యర్థిని బరిలోకి దించాలనే ప్రతిపాదనను చంద్రబాబు చేశారని సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను చంద్రబాబు చెప్పకపోయినా ప్రతి పార్టీ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిని ఎంపీలుగా మళ్లీ రాజ్యసభకు పంపుతోందని పరోక్షంగా సుజనా చౌదరి పేరును ఖరారు చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రం నుంచి రైల్వే మంత్రి?
రాష్ట్రంనుంచి బీజేపీ ఒక సీటు కోరుతోందని చంద్రబాబు సమావేశంలో చెప్పారు. గతంలో ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన నిర్మలా సీతారామన్ కర్ణాటక వెళుతున్నారు కాబట్టి ఆమె స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. రాజ్యసభ సీటు ఇవ్వాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనకు ఫోన్ చేసి కోరారని నేతలతో చెప్పారు.
బీజేపీ కోరిన వెంటనే సీటు ఇస్తే చులకన అవుతాం కాబట్టి రాష్ట్రానికి ఏదో ఒక సాయం చేస్తామని బీజేపీ ప్రకటిస్తే సీటు ఇస్తామని ప్రతిపాదించానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఎస్సీ సామాజికవర్గం నుంచి హేమలత, మసాల పద్మజ, లలితకుమారి సీటు ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి సీటు ఇవ్వాలో చంద్రబాబు సోమవారం రాత్రికి ఖరారు చేసే అవకాశం ఉంది. మూడో సీటుకు బీసీల నుంచి బీటీ నాయుడు, ఎస్సీల నుంచి జేఆర్ పుష్పరాజ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే పలువురు నేతలు పుష్పరాజ్ పేరును సూచించగా చంద్రబాబు మౌనంగా తలాడించినట్లు సమాచారం. ఇక నాలుగో అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని బరిలోకి దించుతారు.