‘కాంగ్రెస్’తో నింపేద్దాం!
వలస నేతలపైనే ఆధారపడుతున్న చంద్రబాబు
ఎటూ వెళ్లలేని కాంగ్రెస్ నేతలను
టీడీపీలో చేర్చుకోవాలని ఆదేశాలు
అడిగిన చోట టికెట్, భారీ ప్యాకేజీలతో
కోటరీ నేతల సంప్రదింపులు
కాంగ్రెస్ నేతలకు చోటు కోసం
పార్టీ నేతలను పక్కనపెట్టేస్తున్న వైనం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వలస వచ్చే నేతలపైనే పూర్తిగా ఆధారపడుతోంది. పార్టీ భవిష్యత్తు గందరగోళంగా మారడం, అధ్యక్షుడు చంద్రబాబు ఇమేజీ పూర్తిగా దెబ్బ తినడంతో కాంగ్రెస్ నుంచి చేరికలను ప్రోత్సహించి, తద్వారా పార్టీ ‘గ్రాఫ్’ పెరిగిందన్న ప్రచారం చేసుకోవాలని భావిస్తోంది. కొంత కాలంగా ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి ప్రయత్నించి అవకాశాల్లేక ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ ఇప్పుడు టీడీపీలో చేర్పించేందుకు బాబు ఆదేశానుసారం పార్టీలోని ఆయన కోటరీ ముఖ్యులు, పారిశ్రామికవేత్తలు తె ర వెనక ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అడిగిన టికెటివ్వడంతో పాటు భారీ ప్యాకేజీలు చూపించైనా సరే ఇతర పార్టీల నేతలను పెద్ద ఎత్తున రప్పించాలని బాబు స్పష్టం చేశారని, అందుకే వారు పెట్టే ఎలాంటి షరతులకైనా టీడీపీ నాయకత్వం అంగీకరిస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి.
జాబితా తయారు చేసుకుని మరీ
రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజలకు దూరమవడంతో ఆ పార్టీ నేతల చూపు ఇతర పార్టీలపై పడింది. వారిలో చాలామంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు విఫలయత్నం చేశారని, రాజకీయ భవితవ్యంపై మల్లగుల్లాలు పడుతున్న అలాంటి వారందరినీ చేర్పించుకోవాలని టీడీపీ నాయకత్వం స్కెచ్ వేసిందని చెబుతున్నారు. అందుకోసం జాబితా తయారు చేసి ప్రయత్నాల్లో పడిందని సమాచారం!
పారిశ్రామికవేత్తలదే కీలక పాత్ర
టీడీపీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేశ్, మరో రాజ్యసభ సభ్యుడు వై.ఎస్.చౌదరి (సుజనా చౌదరి), తాజాగా రాజ్యసభకు ఎన్నికైన గరికపాటి మోహనరావు ప్రస్తుతం ఇదే పనిలో పడ్డారు. ఆపద్ధర్మ మంత్రులు టి.జి.వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, యు.వి.రమణమూర్తిరాజు, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేశ్ బాబు తదితరులకు బాబుతో భేటీ ఏర్పాటు చేయడంలో వీరిదే కీలక పాత్ర.
అడిగినవారికి అడిగినన్ని
ఆదాల ప్రభాకరరెడ్డి కూడా బాబుతో భేటీ కాగా, నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయన అనగానే బాబు అంగీకరించారని తెలుస్తోంది. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీకి కూడా అభ్యర్థులెవరూ సిద్ధంగా లేరు. గంటా కూడా విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగుతాననగానే బాబు ఓకే అనేశారు. తన వియ్యంకుడైన బాలకృష్ణకు సమీప బంధువు ఎం.వి.వి.ఎస్.మూర్తిని విశాఖలో పక్కన పెట్టాలని బాబు నిర్ణయించినట్టు సమాచారం.
కాంగ్రెస్ వారందరినీ చేర్చుకుంటాం
ఎవరూ అభ్యంతరం చెప్పొద్దు: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్
కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ఎవరు వస్తే వారిని తెలుగుదేశంలో చేర్చుకుందామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల చేరికపై ఎవ్వరూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా సహకరించాలని చెప్పారు. శుక్రవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కలసి.. స్థానికుడైన కంఠమనేని రవీంద్రకు టికెట్టు ఇవ్వాలని, అదే సమయంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ను పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. మండలిని చేర్చుకోవద్దన్న వారిైపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు వచ్చినా టీడీపీ చేర్చుకుంటుందని చెప్పారు. మండలిని చేర్చుకుని ఆయనకు టికెట్టు ఇచ్చే బదులు స్థానికంగా ఉన్న కంఠమనేని రవీంద్ర లేదా మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు, వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్‌కు అయినా టికెట్టు ఇవ్వాలని స్థానిక నేతలు కోరినా చంద్రబాబు వినిపించుకోలేదని టీడీపీ వర్గాలు చెప్పాయి. అలాగే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీటును మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులుకు ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు అధినేతను కలసి కోరారు. గతంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన నిమ్మకాయల రాజ్‌నారాయణయాదవ్ లేదా పీఆర్‌పీ తరఫున పోటీచేసి ఓడిపోయిన బైరా దిలీప్‌ను పార్టీలో చేర్చుకుని సీటు ఇవ్వవద్దని కోరారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో కూసం బ్రహ్మారెడ్డి, సుభాని తమ అనుచరులతో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
పాత నేతలను పక్కనపెట్టి..
ఎంతోకాలంగా పార్టీలో ఉన్న నాయకులను వదులుకొనైనా సరే కాంగ్రెస్ నుంచి వచ్చే వారిని చేర్చుకోవాలని, తద్వారా పార్టీ ఇమేజీ పెరుగుతుందని టీడీపీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామంటూ పాత కాపులను బుజ్జగించే ప్రయత్నం జరుగుతోంది.
విశాఖ జిల్లా నుంచి చేరికల నేపథ్యంలో... ఎంతోకాలంగా టీడీపీనే నమ్ముకుని ఉన్న ఆంజనేయరాజు, బండారు సత్యనారాయణమూర్తి, భరణికాన రామారావులను పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇటీవల టీడీపీలో చేరారు. ఎంతోకాలంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యంను తొలగించడమే గాక బండారును పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, భీమవరం ఎమ్మెల్యే ఆంజనేయులు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నానిలను చేర్చుకున్నారు. వారికి ఉంగుటూరు, భీమవరం, తాడేపల్లిగూడెం సీట్లు కేటాయించారు. గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరాజు, మెంటే పార్థసారథి, గాదిరాజు సత్యనారాయణరాజులను టీడీపీ నాయకత్వం పక్కన పెట్టేసింది.
కృష్ణా జిల్లాలో మంత్రి కె.పార్థసారథి టీడీపీలో చేరతారని బలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన పెనమలూరు లేదా నూజివీడు సీటు కోరుతున్నారు. ఏదైనా ఇస్తామంటూ టీడీపీ సమాచారం పంపింది. ఆయనకు పెనమలూరు కేటాయిస్తే ఇంత కాలం పార్టీని నమ్ముకుని నియోజకవర్గంలో పని చేసిన బడే ప్రసాద్, చలసాని పద్మావతి, వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ల పరిస్థితి అగమ్యగోచరమే. పార్థసారథికి నూజివీడు టికెటిస్తే బి.అర్జునుడుయాదవ్ పరిస్థితీ అంతే.
నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాక రరెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరనున్నారు. కాబట్టి టి.రమేశ్‌రెడ్డి, కోవూరులో పెల్లకూరు శ్రీనివాసులు రెడ్డిల పరిస్థితీ అగమ్యగోచరమే.
కర్నూలు జిల్లా నుంచి మంత్రులు టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డిలను టీడీపీలో చేర్చుకుంటున్నారు. నంద్యాలలో శిల్పాకు టికెటిస్తే టీడీపీలో పార్టీ ఆరంభం నుంచీ ఉన్న ఎన్‌ఎండీ ఫారూఖ్, శ్రీశైలం టికెట్ ఏరాసుకిస్తే అక్కడి ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి, ఒకవేళ పాణ్యం కేటాయిస్తే ఇటీవలే అక్కడ ఇన్‌చార్జి అయిన కె.జనార్దనరెడ్డిలది దిక్కుతోచని స్థితే. టీజీకి టికెటిస్తే రాంభూపాల్ చౌదరికి మొండిచేయే. మరోచోట అవకాశం కల్పిస్తామంటూ వారిని బుజ్జగిస్తున్నారు.