
'టీడీపీ నేతలు 10వేల సార్లు ఆత్మహత్య చేసుకోవాలి'
తమ పాలనలో రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ నాయకులు వెయ్యిసార్లు, టీడీపీ నేతలు 10 వేల సార్లు ఆత్మహత్య చేసుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.
హైదారాబాద్: తమ పాలనలో రైతులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ నాయకులు వెయ్యిసార్లు, టీడీపీ నేతలు 10 వేల సార్లు ఆత్మహత్య చేసుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చనిపోయిన రైతుల శవాలను సీఎం కార్యాలయం వద్ద వేస్తామని తెలుగుదేశం నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల శవాలను చంద్రబాబు ఇంటి వద్ద, విజయవాడ క్యాంపు ఆఫీసులో వేయాలని వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్ పాలించిన 19 ఏళ్ల కాలంలో 26 వేల మంది రైతులు చనిపోగా, కేవలం టీడీపీ హయాంలోనే 12వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగ అంటూ రైతుల పాణాలు తీసిన చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న ఏపీలోనూ అదే విధానం అవలంబిస్తున్నాడన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.17వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.8 వేల కోట్లు జమ చేసిన విషయాన్ని కర్నె ప్రభాకర్ గుర్తు చేశారు. రైతు సంక్షేమం, మిషన్ కాకతీయ, జలవిధానం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్పై టీడీపీ నాయకులు ఉన్మాదంతో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.