ఖమ్మంలో సైకిల్‌కు పంక్చర్! | tdp loose strength in khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో సైకిల్‌కు పంక్చర్!

Published Fri, Sep 5 2014 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

ఖమ్మంలో సైకిల్‌కు పంక్చర్! - Sakshi

ఖమ్మంలో సైకిల్‌కు పంక్చర్!

* టీఆర్‌ఎస్ ‘ఆపరేషన్ స్వీప్’కు ఖాళీ అవుతున్న తెలుగుదేశం
* తుమ్మల ఆధ్వర్యంలో నేడు టీఆర్‌ఎస్‌లో చేరిక
* ఖమ్మంలో 80 శాతం టీడీపీ నేతలకు గులాబీ తీర్థం
* వెయ్యి వాహనాల్లో తరలిరానున్న నేతలు..
* మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి సహా కోదాడ టీడీపీ నేతల చేరిక నేడే
* ఆ తరువాత గ్రేటర్ వంతు

 
సాక్షి, హైదరాబాద్ : సైకిల్‌కు గులాబీ ముల్లు గుచ్చుకుంది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న ఎత్తులకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కకావికలమవుతోంది. పార్టీకి పెద్దగా బలంలేని  ఖమ్మం జిల్లాపై ఆ పార్టీ విసిరిన ‘ఆపరేషన్ స్వీప్’ అస్త్రానికి ఆ జిల్లాలోని దాదాపు 80 శాతం టీడీపీ ఖాళీ అవుతోంది.  ఒక్క ముక్కలో చెప్పాలంటే  నామా నాగేశ్వరరావు మినహా ఆ జిల్లాలో చెప్పుకోదగిన ఒక్క నాయకుడూ మిగలకుండా పోయారు.  మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును ముందు నిలిపి కేసీఆర్ వేసిన పాచికలకు ‘దేశం’ పార్టీ కుదేలైంది.
 
మొన్నటికి మొన్న ఎన్నికైన జెడ్పీ చైర్‌పర్సన్ జి.కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు సహా జిల్లాకు చెందిన 80 శాతం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రముఖ కార్యకర్తలంతా గురువారం తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. తుమ్మల ఆధ్వర్యంలో ఆయా నాయకులంతా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. దాదాపు వెయ్యి వాహనాల్లో జిల్లా టీడీపీ శ్రేణులంతా ర్యాలీగా బయలుదేరి శుక్రవారం రాజధానికి వస్తున్నారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాపై టీఆర్‌ఎస్ పట్టు సాధించినట్టయింది. ఖమ్మంపై ప్రయోగించిన ‘ఆపరేషన్ స్వీప్’ అస్త్రం విజయవంతం కావడంతో కేసీఆర్ తాజాగా మిగిలిన జిల్లాలపైనా దృష్టి సారించారు.
 
ఇక గ్రేటర్‌పై గులాబీ పరిమళం...
ప్రధానంగా తెలంగాణలో టీడీపీ నాయకత్వం బలహీనంగా ఉన్న జిల్లాలపై ఈ ‘ఆపరేషన్ స్వీప్’ అస్త్రాన్ని ప్రయోగించాలనేది టీఆర్‌ఎస్ ఎత్తుగడ. అందులో భాగంగా మరికొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్ ఆధిపత్యం సాధించే దిశగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ముఖ్య నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నారు.
 
ఇప్పటికే సనత్‌నగర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యదవ్, ప్రకాశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మాజీమంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్‌లతోపాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ కార్పొరేటర్లతోనూ టీఆర్‌ఎస్ నేతలు ఇటీవల ఆంతరంగిక చర్చలను కొనసాగిస్తున్నారు. దానం, ముఖేశ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరే అంశాన్ని ఖండిస్తున్నా చర్చల ప్రక్రియను మాత్రం టీఆర్‌ఎస్ నేతలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement