
11 దాకా అసెంబ్లీ
► మండలి కూడా.. బీఏసీ భేటీలో నిర్ణయం
► తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న ప్రతిపక్షాలు
► నిరసన కూడా తెలపనివ్వడం లేదంటూ అసంతృప్తి
► విపక్షాలకే ఎక్కువ సమయం ఇచ్చామన్న అధికార పక్షం
► 6వ తేదీ వరకు ఎజెండా ఖరారు..
► 11న మరోమారు బీఏసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు జనవరి 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈమేరకు తేదీలను పొడిగిస్తూ ఇరు సభల బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఆయన చాంబర్‌లో అసెంబ్లీ బీఏసీ భేటీ జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి, టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, సీపీఎం నుంచి సున్నం రాజయ్య హాజరయ్యారు.
వచ్చే నెల 11వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించాలని భేటీలో నిర్ణయించారు. 3, 4, 5, 6 తేదీల్లో వరుసగా నాలుగు రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. 7, 8 తేదీల (శని, ఆదివారాలు)ను సెలవుగా ప్రకటించారు. తర్వాత 9, 10, 11 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఇక 11వ తేదీన మరోమారు భేటీ కావాలని, అవసరమైతే సంక్రాంతి వరకు సమావేశాలు జరిపే విషయంలో నిర్ణయం తీసుకుందామని బీఏసీ నిర్ణయించింది. ఇక జనవరి 6వ తేదీ వరకు వరకు సభలో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేశారు. జనవరి 3న మత్స్య సంపద అభివృద్ధిపై, 4న ఫీజు రీయింబర్స్‌మెంట్, 5న సింగరేణి, 6న ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్, ఎస్సీలకు మూడెకరాల భూపంపిణీ అంశాలపై చర్చ చేపట్టనున్నారు. ఇంకా బీసీ, మైనారిటీ సంక్షేమం, కేజీ టు పీజీ, శాంతి భద్రతలు, స్వయం సహాయక సంఘాలు తదితర అంశాలపైనా చర్చించనున్నా తేదీలు ఖరారు కాలేదు.
విపక్షాలకు అవకాశమివ్వడం లేదు: జానారెడ్డి
శాసనసభలో తమకు సరిగా అవకాశం ఇవ్వడం లేదని బీఏసీ సమావేశంలో సీఎల్పీ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు పదే పదే జోక్యం చేసుకుంటున్నారని.. వారిని స్పీకర్, సీఎంలు వారించడం లేదని పేర్కొన్నారు. సభలో విపక్షాలకు కనీసం నిరసన తెలిపే అవకాశమివ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... విపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని అంగీకరించారు. నిరసన తెలపడం, వాకౌట్ చేసే అవకాశం ఉంటుందని, ఇందుకోసం విపక్షాలకు సమయం ఇవ్వాల్సిందేనని... దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 12.36 గంటలు మాట్లాడితే... అధికార పక్షం కేవలం 9 గంటలు మాత్రమే మాట్లాడిందని అధికారపక్షం బీఏసీ భేటీలో వివరించింది.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..
భూసేకరణ చట్టం విషయంలో సీఎం మాట్లాడిన భాషపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అది తన భాష అని సీఎం కేసీఆర్ వివరించారు. ఇక మంత్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఎవరైనా సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు మంత్రులు మధ్యలో జోక్యం చేసుకుంటూ అడ్డు తగులుతున్నారని, అలా రావొద్దని విపక్షాలు పేర్కొన్నాయి. ఆయా అంశాలపై నిరసన తెలిపే అవకాశమివ్వాలని కోరాయి. ప్రభుత్వ అంశాలనే ఎజెండాలో పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
పార్టీ ఫిరాయింపులపై తేల్చండి
బీఏసీ భేటీలో పార్టీ ఫిరాయింపుల విషయాన్నీ తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. టీడీపీ సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఈ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు. అయితే ఆ అంశం కోర్టులో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. అయినా మెజారిటీ సభ్యులు విలీనమయ్యారని, చట్టంలో ఆ వెసులుబాటు ఉందని వ్యాఖ్యానించారు. భూసేకరణ చట్టంపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. అది చట్టమేనని, సవరణ కాదని తెలిపారు.
మండలి బీఏసీ భేటీ కూడా..
శాసన మండలిలోనూ చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు, చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కాంగ్రెస్ నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు రాంచంద్రరావు, ఎంఐఎం తరఫున రిజ్వీ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభతో పాటు మండలి సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఎన్ని రోజులైనా సభ నిర్వహిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అయినా అవకాశం ఇస్తలేవు కదా..!
అసెంబ్లీ బీఏసీ భేటీలో జానారెడ్డి, కేసీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. జానారెడ్డి వేసుకున్న డ్రెస్‌ను చూస్తూ.. ‘ప్రధాని మోదీలా డ్రస్ వేశారు అన్నా..’అని సీఎం కేసీఆర్ పేర్కొనగా... ‘అయినా కూడా అవకాశం ఇస్తలేవ్ కదా ..’అని జానా సెటైర్ వేశారు.