
నాకేమీ కొమ్ములు రాలేదు: కేసీఆర్
చిన్ననాటి నుంచి తెలంగాణ కోసం పోరాటం చేసిన మహామనిషి ప్రొ.జయశంకర్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అలాంటి మహానీయుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో లేకపోవడం మన దురదృష్టం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ప్రొ.జయశంకర్ మూడో వర్థంతి. ఈ సందర్బంగా తెలంగాణ భవన్లోని ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... నమ్మిన సిద్దాంతం కోసం తుది వరకు పోరాటం చేసే వ్యక్తి జయశంకర్ అని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా బతకాలని ఆయన ఎన్నో కలలు కన్నారని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. 2001 నాటికి ముందు నుంచే తెలంగాణ ఉద్యమం కోసం కసరత్తు చేసినట్లు కేసీఆర్ వివరించారు. ప్రొ.జయశంకర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని నడిపినట్లు ఆయన ఈ సందర్భంగా విశదీకరించారు. ప్రొ. జయశంకర్ పేరిట హైదరాబాద్ నగరంలో మెమోరియల్తోపాటు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు జయశంకర్ పేరు పెడతామని వెల్లడించారు.
నాకు మంత్రి పదవి రాకనే టీఆర్ఎస్ పార్టీ పెట్టారని పలువురు ఆరోపిస్తున్నారని... ఆ ఆరోపణలు కాలం చెల్లిన మెడిసిన్ లాంటిదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయినా పాత కేసీఆర్నే అని తనకు ఏ కొమ్ములు రాలేదన్నారు. సచివాలయంలో కొత్తవారు... పార్టీ ఆపీస్లో పాతవారు కనిపిస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారందరికీ పదవులు ఇస్తామని చెప్పారు. త్వరలో పార్టీ కార్యక్రమాలను భారీ ఎత్తున్న నిర్వహిస్తామని అందుకోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది ఇడ్లీ సాంబార్, రికార్డింగ్ డాన్సులే అంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రొ.జయశంకర్ వర్ధంతి సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో పాటు భారీగా ఆ పార్టీ కార్యకర్తులు పాల్గొన్నారు.