టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసింది: కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. గతంలో ఏ పార్టీ కూడా ఇవ్వనన్ని స్థానాలు ఇచ్చి అద్భుత విజయాన్ని అందించిన జంట నగరాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ అయిన తర్వాత గత చరిత్రలో ఏ పార్టీకి 52 స్థానాలకు మించి రాలేదన్నారు.
హైదరాబాద్ నగర చరిత్ర చూసినా... ఏ ఒక్క పార్టీ నేరుగా జీహెచ్ఎంసీలో అధికారం చేపట్టిన చరిత్ర లేదన్నారు. ఇది ఏ ఒక్కరిదో కాదని, అందరి సమిష్ట కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కేసీఆర్ తెలిపారు. శ్రమించి, కష్టపడి పనిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు, నగర టీఆర్ఎస్ నాయకులతో పాటు అహోరాత్రులు కష్టపడిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే... ''టీఆర్ఎస్ నాయకత్వానికి మరోసారి విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో గర్వం, అహంకారం రాకూడదు. ఎంత విజయం చేకూరిస్తే అంత అణకువతో పోవాలి. పార్టీ మీద, నాయకత్వం మీద.. ముఖ్యంగా ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత పెరిగింది. నగరం నుంచి ఉన్న మంత్రుల మీద పెద్ద బరువు మోపారు. ప్రజలు ఎప్పుడు నిర్ణయం ఇచ్చినా, అలవోకగా ఇవ్వరు. టీఆర్ఎస్‌కు అందిన విజయం ప్రజలు ఇష్టపడితే తప్ప.. మనం కష్టపడితే వచ్చే ఓట్లు కావు. మీరు ఎంత గొప్ప విజయం ఇచ్చారో, అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు... ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రజలు మననుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నారని, డబుల్ బెడ్రూం ఇళ్లపై ఎక్కువ ఆశలు ఉన్నాయని చెప్పారు. కచ్చితంగా రాబోయే బడ్జెట్‌లో జంటనగరాల ప్రజలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని చెబుతున్నా. ఇంత కడితే నాలుగైదు ఏళ్లలో పేదలందరికీ ఇళ్లు అందించే అవకాశం ఉంటుంది.
అపోహలు సృష్టించారు
జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా ఆచరించి తీరుతాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో తప్పనిసరి ఉచిత విద్య ఒక్కదాన్నే అమలుచేయలేకపోయాం, దాన్ని కూడా త్వరలోనే అమలుచేస్తాం. పేదల ఎజెండానే మా ఎజెండాగా సాగుతాం. ఉద్యమ సందర్భంలోను, తర్వాత ఎన్నికల్లోను కొందరు అనేక అపోహలు సృష్టించారు. టీఆర్ఎస్ వాళ్లు సెటిలర్లను, ఆంధ్ర ప్రాంతీయులను ఇబ్బంది పెడతారని మభ్యపెట్టారు. కానీ హైదరాబాదీయులంతా టీఆర్ఎస్ వైపే... తామంతా కేసీఆర్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా మా బిడ్డలే. మహారాష్ట్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, ఆంధ్ర ప్రాంత సోదరులు ఇక్కడే బతుకుతామని వచ్చినా అంతా సమానమే. ఏ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమైనా తమ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడం, వారికి ఉపాధి కల్పించడం. అది మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా అపోహలు ఉన్నా అవి పటాపంచలు అయ్యాయి.
ఒక్క సెకను కూడా కరెంటు పోనివ్వం
నగరానికి మంచినీళ్ల సమస్య లేకుండా చేస్తాం. ముంబై తరహాలో ఐలండ్ పవర్ సప్లై ద్వారా హైదరాబాద్ నగరంలో ఒక్క సెకను కూడా కరెంటు పోకుండా చూస్తాం. శాంతి భద్రతల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజీధోరణి అవలంబించదు. ఎంత పెద్దవాళ్లయినా ఐరన్ హ్యాండ్‌తో అణచివేస్తాం.
కొత్తగా ఆస్పత్రులు
50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉస్మానియా, గాంధీ తప్ప మరో పెద్ద ప్రభుత్వాస్పత్రి లేదు. కచ్చితంగా కింగ్ కోఠి ఆస్పత్రిని 1000 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తాం. మరో రెండు వెయ్యి పడకల ఆస్పత్రులు కూడా నిర్మిస్తాం. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి ప్రాంతంలో ఒకటి, రాజేంద్రనగర్.. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఒకటి, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ఒకటి కట్టిస్తాం. ఎంఆర్ఐతో సహా.. అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అపోలో, కిమ్స్, యశోద ఆస్పత్రిలో ఏ స్థాయిలో ఉంటాయో ఈ పేదల ఆస్పత్రులను ఏడాదిలోగా నిర్మించి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తాం. మొత్తం ఆరు ఆస్పత్రులు వస్తాయి. ఉస్మానియాలో ఉన్న స్థలంలో కూడా అదనపు భవనాలు కట్టిస్తాం.
ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు మానాలి
హైదరాబాద్‌ను నిజమైన అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు భగవంతుడు ఇచ్చిన అన్ని శక్తులు వెచ్చించి కృషిచేస్తాం. ప్రతిపక్షాలు ఇక అవాకులు, చవాకులు వాగకుండా, సరైన పంథాలో నిర్మాణాత్మక సహకారం అందించాలి. ప్రతిపక్షాలకు ఒకటే విజ్ఞప్తి.. మంచి సలహాలు ఇవ్వండి. మిమ్మల్ని సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టారు కాబట్టి ఇక అనవసరమైన అర్థంపర్థం లేని విమర్శలు, వ్యక్తిగత నిందారోపణలు చేయొద్దు. వరంగల్ ఫలితం తర్వాతే మారుతారని ఆశించా.. కనీసం హైదరాబాద్ ఫలితం తర్వాతైనా మారండి.
హైకోర్టు తీర్పును గౌరవిస్తాం
హైకోర్టు తీర్పును గౌరవించి, వాళ్లు చెప్పిన ప్రకారమే ఎన్నికలు నిర్వహించాం. ఎక్స్ అఫీషియో సభ్యులు ఎప్పుడూ ఉన్నారు.. వాళ్లు ఓటింగులో కూడా పాల్గొనచ్చు. అయితే ఇప్పుడు ఆ అవసరం కూడా ఉండకపోవచ్చు. చట్టం ద్వారా చేయాలని హైకోర్టు చెప్పింది.. దాన్ని మేం తప్పకుండా పాటిస్తున్నాం.
లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండకూడదు
పరేడ్ గ్రౌండులో ప్రజలకు నేను మాట ఇచ్చాను.. చాలామంది యువ కార్పొరేటర్లు గెలిచారు. వాళ్లు ప్రజలను తమ గుండెల్లో పెట్టుకోవాలి. జీహెచ్ఎంసీలో లంచం ఇవ్వక్కర్లేకుండా ఇంటి పర్మిషన్ తీసుకోగలిగేలా అందరూ కృషిచేయాలి. అప్పుడే మనం గెలిచిన గెలుపునకు ఒక సార్థకత ఉంటుంది. ఈ బాధ్యత నగరంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు అని మాకు వేరేగా ఏమీ ఉండవు. మేం మాత్రం అందరినీ కలుపుకొని వెళ్తాం. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు, గొడవలు పునరావృతం కాకుండా అన్ని పార్టీలు కృషి చేయాలి, పోలీసులు కూడా జాగ్రత్తలు వహించాలి. మేయర్ విషయం మీద అందరం కలిసి కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. ఏడాదిలోగా లక్ష కుటుంబాల ప్రజలు డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లేలా కూడా చూస్తాం''.