♦ పాలేరులో పునరాలోచన విజ్ఞప్తితో కలిసే యత్నం
♦ సమయం లేదంటూ తిరస్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో పోటీపై పునరాలోచన చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అపాయింట్‌మెంట్ కోరిన టీపీసీసీకి నిరాశ ఎదురైంది. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సోమవారం టీపీసీసీతోపాటు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరిత, వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. సమయం లేదంటూ తిరస్కరించారు. తెలంగాణ కోసం, పాలేరు నియోజకవర్గ ప్రజల కోసం రాంరెడ్డి వెంకటరెడ్డి చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని పాలేరులో టీఆర్‌ఎస్ పోటీపై పునరాలోచన చేయాలని వెంకటరెడ్డి సతీమణి సుచరిత ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
అనంతరం స్వయంగా సీఎం కేసీఆర్‌ను కలసి ఈ విజ్ఞప్తి చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. కానీ ఈ విజ్ఞప్తిని కేసీఆర్ తిరస్కరించినట్టు టీపీసీసీ నేతలు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు సమయం లేదని, కలవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సమాధానమిచ్చినట్లు తెలిపారు.