హైదరాబాద్ : ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్‌పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. బెదిరింపు కాల్స్‌ను ధ్రువీకరించిన ఆయన ... అవసరం అయితే అకున్ సబర్వాల్‌కు అదనపు భద్రత కల్పిస్తామన్నారు. బెదిరింపు కాల్స్‌పై ఇంటెలిజెన్స్ అధికారులకు అకున్ సబర్వాల్ ఫిర్యాదు చేశారన్నారు. ఈ కాల్స్‌పై విచారణ జరుగుతోందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఇంటెలిజెన్స్ పరిశీలిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో బెదిరింపు కాల్స్‌పై స్పష్టత వస్తుందన్నారు.
కాగా డ్రగ్స్ మాఫియా కేసు విచారణను తక్షణమే నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు అకున్ సబర్వాల్‌కు కాల్ చేసి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది.
దీంతో డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది.