హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్-2 పరీక్ష శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి 38,245 మంది విద్యార్థులు హాజరు కానుండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,943 మంది (31.93 శాతం) విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. ఇక ఏపీ విద్యార్థుల కోసం 28 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించారు.
కాగా ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అధికారులు ముందు నుంచి సూచించినప్పటికీ పలు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని లోనికి అనుమతించకపోవటంతో గేటు వద్ద నుంచే వెనుదిరిగారు. కాగా ప్రాథకమిక కీని ఈరోజు సాయంత్రం, ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. కాగా ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సెట్ కోడ్ 'ఆర్'ను ఎంపిక చేశారు.