మాపై కక్ష తీర్చుకుంటున్నారు..
♦ పశుసంవర్థక శాఖలో తెలంగాణ ఉద్యోగుల నిరసన
♦ మూడు నెలలుగా జీతాలు చెల్లించ డం లేదని ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడిన తమను అధికారులు కక్షపూరిత చర్యలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏపీ పశుసంవర్థక శాఖ నాలుగో తరగతి ఉద్యోగులు కొం దరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శాంతినగర్‌లో ఉన్న ఏపీ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజన విరామంలో వీరు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం ప్రతినిధి బి.జి.కరుణాకర్ మాట్లాడుతూ.. కమల్‌నాథన్ కమిటీ సిఫారసుల మేరకు 58:42 నిష్పత్తిలో తెలంగాణ నుంచి ఏపీకి పశుసంవర్థక శాఖలోని 22 మంది ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరి 11న బదిలీ అయ్యారని చెప్పారు.
కానీ మూడు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పశుసంవర్థక శాఖ డెరైక్టర్‌ను కలసి పలుసార్లు వినతిపత్రం అందించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడామనే కారణంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన తమను విజయవాడకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.