Employee Association
-
‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం’
సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలో పెండింగ్‌లో ఉన్న రూ. 511 కోట్ల బిల్లులను పూర్తిగా చెల్లించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. CFMS ప్రకారం చెల్లించడం వల్ల కాస్త ఆలస్యం జరిగిందన్నారు మంత్రి. టీడీపీ ప్రభుత్వ హయాంలో CFMS విధానం తీసుకొచ్చారన్నారు. ‘స్వచ్ఛంద్ర కార్పోరేషన్ ద్వారా 2 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. పన్నుల విధానంలో సంస్కరణలతో మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగింది. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం పనులు చేపడుతోంది. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో గత సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఉద్యోగుల పెండింగ్ బిల్స్ పై చర్చ జరిగింది. జీపీఎస్ విధానంపై ఉద్యోగ సంఘాలకి పవర్ పాయింట్ ద్వారా వివరించాం. పాత పెన్షన్ వల్ల కలిగే నష్టాలు...జిపిఎస్ ఉపయోగాలు వివరించాం. ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తున్నాం. ఈ సమావేశంలో కూడా కీలక అంశాలపై చర్చ జరగనుంది’ అని పేర్కొన్నారు. -
ఉద్యోగులకు చంద్రబాబు వల
-
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు
-
రచ్చకెక్కిన ఏయూ ఎన్నికలు
సాక్షి, ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల సంఘం ఎన్నికలు వివా దాస్పదంగా మారాయి. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓట్లు చేర్చడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ పంచాయతీ వీసీ వద్దకు చేరింది. ఏయూ బోధనేతర ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈ నెల 17న విడుదల చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. బుధవారం నీలాపు శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానళ్లు, గురువారం జి.రవికుమార్ ప్యానల్ నామినేషన్లు దాఖలు చేశాయి. ఇక్కడ వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల అధికారి ఆచార్య జి.సుధాకర్ గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్తగా 185 మందిని ఓటర్లుగా చేర్చుతున్నట్టు అభ్యర్థులకు తెలియజేశారు. దీనిని శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానల్ సభ్యులు వ్యతిరేకించారు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలని, నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓటర్లను చేర్చడం ఏమిటని ఎన్నికల అధికారిని నిలదీశారు. వర్సిటీ వీసీ సంతకంతోనే నూతన జాబితా తనకు చేరిందని ఎన్నికల అధికారి చెప్పడతో వివా దం వర్సిటీ వీసీ కార్యాలయానికి చేరింది. వాగ్వాదాలు.. కేకలు వర్సిటీ వీసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకుల వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీ ఎదురుగానే ఉద్యోగులు ఘర్ణణకు దిగారు. పెద్దగా కేకలు వేశారు. చివరకు వీసీ స్వయంగా వర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్లను పిలిచి మాట్లాడారు. అనంతరం పోటీ చేస్తున్న మూడు ప్యానళ్ల అధ్యక్షులతో సమావేశమయ్యారు. వీసీ సూచన మేరకు న్యాయ నిపుణుల తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి జి.సుధాకర్ తెలిపారు. ఏమిటీ జాబితా? ఎందుకీ వివాదం ఎన్నికలు ప్రారంభ సమయంలో, నోటిఫికేషన్ విడుదల సమయంలో వర్సిటీలో 1634 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాను అభ్యర్థులకు సంతకం చేసి ఎన్నికల అధికారి అందజేశారు. తాజాగా గురువారం సాయంత్రం హాస్టళ్లలో పనిచేస్తున్న 185 ఉద్యోగుల జాబితాను దీనికి జత చేయాలని సూచిస్తూ వర్సిటీ వీసీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వర్సిటీ ఉద్యోగులకు ఎన్నికలు నిర్వహించడానికి ముందు నెలలో రూ.10 వేతనం నుంచి సేకరించారు. మే నెల వేతనాలు నుంచి 1634 మంది ఉద్యోగులకు దీనిని సేకరించారు. తాజాగా జత చేసిన ఉద్యోగులకు గత నెల వేతనాల నుంచి ఎన్నికల నిధిని సేకరించలేదు. వీరికి సంబంధించిన రూ.1850 డీడీ రూపంలో చెల్లించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్యానల్‌కు సంబంధించిన పోటీదారుడే ఈ రుసుం చెల్లించారని వారు ఆక్షేపిస్తున్నారు. సాధారణంగా హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగులకు హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్‌లో మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వర్సిటీ విభాగాలలో పనిచేసే వారికి ఏయూ ఈయూలో ఓటు హక్కు ఉంటుంది. దీనికి విరుద్ధంగా హాస్టళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని పోటీదారులు కోరుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిశాక చేర్పులా.. ఇప్పటికే వర్సిటీ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగి సింది. తాజాగా పలువురి ఓట్లు జాబితాలో చేర్చాలనే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలు జరిపించాలి. – బుద్దల తాతారావు, పోటీదారుడు ఇదెక్కడి న్యాయం ఉద్దేశపూర్వకంగా కొంతమంది వర్సిటీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వర్సిటీ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని ఎంత మాత్రం సహించేది లేదు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలి. మార్పులు, చేర్పులు అనుమతించరాదు. – నీలాపు శివారెడ్డి, పోటీదారుడు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.. వర్సిటీలో పనిచేస్తున్న ఎంటీఎస్‌లో కొంత మంది ఉద్యోగులకు గత నెలలో ఎన్నికలకు సంబంధించిన రూ.10 వేలు వేతనం కోత జరగలేదు. దీంతో వీరంతా ఈ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి వారికి ఓటు హక్కు కల్పించారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా డిజిగ్నేషన్ ఇవ్వకుండా లాస్ట్ గ్రేడ్ కేటగిరీ అంటూ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఇటీవల ఎంటీఎస్ పొందిన వారిలో కొంత మందికి ఓటు హక్కు కల్పించి, మరికొంత మందికి మొండి చేయి చూపడం ఎంత వరకు సమంజసం. – డాక్టర్ జి.రవికుమార్, పోటీదారుడు -
భజన సంఘం నేతలు థాంక్యూ సీఎం సార్ అంటూ..
అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఎలాంటి మేళ్లు జరగలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు ఏ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ ఇంకా పెండింగులో పెట్టారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని వెల్లడించారు. ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోయినా కొంతమంది భజన సంఘం నేతలు థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని విన్నవించారు. -
మాపై కక్ష తీర్చుకుంటున్నారు..
♦ పశుసంవర్థక శాఖలో తెలంగాణ ఉద్యోగుల నిరసన ♦ మూడు నెలలుగా జీతాలు చెల్లించ డం లేదని ఆవేదన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడిన తమను అధికారులు కక్షపూరిత చర్యలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏపీ పశుసంవర్థక శాఖ నాలుగో తరగతి ఉద్యోగులు కొం దరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శాంతినగర్‌లో ఉన్న ఏపీ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజన విరామంలో వీరు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం ప్రతినిధి బి.జి.కరుణాకర్ మాట్లాడుతూ.. కమల్‌నాథన్ కమిటీ సిఫారసుల మేరకు 58:42 నిష్పత్తిలో తెలంగాణ నుంచి ఏపీకి పశుసంవర్థక శాఖలోని 22 మంది ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరి 11న బదిలీ అయ్యారని చెప్పారు. కానీ మూడు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పశుసంవర్థక శాఖ డెరైక్టర్‌ను కలసి పలుసార్లు వినతిపత్రం అందించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడామనే కారణంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన తమను విజయవాడకు తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కార్మికులపై చిన్నచూపు తగదు
కోల్‌బెల్ట్ : సంస్థ లక్ష్యాలను అధిగమించుటకు కృషిచేసిన కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు చూడటం సరికాదని సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టియూసి)కేంద్రకమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్ అన్నారు. పట్టణంలోని బ్రాంచి కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ అధికలాభాలు వచ్చేందుకు శ్రమించిన కార్మికులకు 20 గ్రాముల బంగారు నాణాలు అందించాలని రాజేందర్ డిమాండ్ చేశారు. సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షులు సమ్మిరెడ్డి, నాయకులు నర్సింగరావు, ధరియాసింగ్, అశోక్, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భూపాలపల్లి బ్రాంచి కమిటీ నాయకులు బాతాల రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికలాభాలను ఆర్జించుటకు కృషిచేసిన కార్మికులకు యాజమాన్యం 10 గ్రాముల గోల్డ్ బిల్లలు అందజేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. సమావేశంలో నాయకులు నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, కే.లింగయ్య, వైకుంఠం, ఠాగూర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 60.3 మిలియన్ టన్నులను సాధించినందుకు కార్మికులకు 15 గ్రాముల బంగారు బిల్లలను అందజేయాలని బిఎంఎస్ భూపాలపల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు కొండపాక సాంబయ్యగౌడ్ డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొమురయ్య, రమేష్, మదునయ్య, బ్రహ్మచారి, స్వామి, సదానందం, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
పీడీ మాకొద్దు బాబోయ్
పెదబయలు : చిత్రహింసలకు గురిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు(పీడీ) మాకొద్దం టూ మండలం కేంద్రం పెదబయలులోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 400 మంది బుధవారం ఇంటిముఖం పట్టారు. పీడీ శెట్టి ధనుంజయ్ బూటు కాలితో తన్నడం, కొట్టడంతోపాటు దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ వాపోయారు. పాఠశాలలో 440 మంది విద్యార్థులు ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న పీడీని తొలగించాలని డిమాండ్ చేశారు. అతనిని వెనకేసుకొస్తున్న హెచ్ఎంపై చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాంకు అకౌంటు, ఐడీ కార్డుల కోసం హెచ్ఎం ఒక్కొక్కరి నుంచి రూ.600 చొప్పున వసూలు చేశారని, పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదంటూ ఐటీడీఏ పీవోకు అడ్రస్ చేస్తూ లేఖరాసి నోటీసు బోర్డులో అంటించి వెళ్లిపోయారు. బుధవారం వేకువజామున 4 గంటల నుంచి విద్యార్థులు విడతలు విడతలుగా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారు. ఎవరైనా అధికారులు వస్తే సమాధానం చెప్పడానికి తామున్నామంటూ వారు తెలిపారు. గతంలోనూ ఈ పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. 2012 నవంబరు 21న ఇలాగే విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. పీడీ, హెచ్‌ఎంలపై వేటు.. : పాఠశాల విద్యార్థులు ఇంటిముఖం పట్టారన్న సమాచారం మేరకు గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల ఉదయాన్నే పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులను మందలించారు. సిబ్బంది తీరుపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీడీ ధనుంజయ్, హెచ్ఎం వేణుగోపాలంలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పాఠశాల ఉపాధ్యాయుల మధ్య విభేదాలను గుర్తించామన్నారు. మొత్తం సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తామని విద్యార్థులకు నచ్చజెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం విద్యార్థులు ఇంటి ముఖం పట్టడానికి కారకులైన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునానవృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రావాలని డీడీ కోరారు. ఆమె వెంట ఏటీడబ్ల్యూవో శాంతకుమారి,ఎంపీడీవో సూర్యనారాయణ, తహాశీల్దార్ నెహ్రూబాబు, ఎంఈవో ఎస్‌బిఎల్ స్వామి, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. అప్పారావు, వీఆర్వో రమేష్‌కుమార్ ఉన్నారు. -
సీబీఐ విచారణకు సిద్ధం
భానుమూర్తి ఆరోపణలపై గంగు ఉపేంద్రశర్మ స్పందన కాచిగూడ: మతైక ఉద్యోగుల సంఘం నేత గంగు భానుమూర్తిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ డిమాండ్ చేశారు. బర్కత్‌పురలోని అర్చక భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై భానుమూర్తి తన అనుచరులతో చేయించిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తనపై సీబీఐ విచారణ కూడా జరిపించుకోవచ్చని అన్నారు. సీబీఐ విచారణకు భానుమూర్తి సిద్ధమా అని ప్రశ్నించారు. ఐదువేల మంది అర్చకులకు ట్రెజరీ వేతనాలు వస్తాయని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రూ.5 వేల చొప్పున వసూళ్లకు శ్రీకారం చుట్టిన గంగు భానుమూర్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అర్చక సమాఖ్య ప్రతినిధులు భాస్కరభట్ల రామశర్మ, రాజేశ్వరశర్మ, తెలంగాణ మతైక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ శర్మ, చిరంజీవి శర్మ, సంతోష్ శర్మ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.మోహన్ మాట్లాడుతూ ఉపేంద్రశర్మపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య తమదేనని, అర్చక సమాఖ్య పేరుతో ఏవరైనా ఇక నుంచి ప్రకటనలు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.