ఎన్నికల అధికారితో చర్చిస్తున్న అభ్యర్థులు
సాక్షి, ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల సంఘం ఎన్నికలు వివా దాస్పదంగా మారాయి. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓట్లు చేర్చడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ పంచాయతీ వీసీ వద్దకు చేరింది. ఏయూ బోధనేతర ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈ నెల 17న విడుదల చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. బుధవారం నీలాపు శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానళ్లు, గురువారం జి.రవికుమార్ ప్యానల్ నామినేషన్లు దాఖలు చేశాయి. ఇక్కడ వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.
ఎన్నికల అధికారి ఆచార్య జి.సుధాకర్ గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్తగా 185 మందిని ఓటర్లుగా చేర్చుతున్నట్టు అభ్యర్థులకు తెలియజేశారు. దీనిని శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానల్ సభ్యులు వ్యతిరేకించారు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలని, నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓటర్లను చేర్చడం ఏమిటని ఎన్నికల అధికారిని నిలదీశారు. వర్సిటీ వీసీ సంతకంతోనే నూతన జాబితా తనకు చేరిందని ఎన్నికల అధికారి చెప్పడతో వివా దం వర్సిటీ వీసీ కార్యాలయానికి చేరింది.
వాగ్వాదాలు.. కేకలు
వర్సిటీ వీసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకుల వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీ ఎదురుగానే ఉద్యోగులు ఘర్ణణకు దిగారు. పెద్దగా కేకలు వేశారు. చివరకు వీసీ స్వయంగా వర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్‌లను పిలిచి మాట్లాడారు. అనంతరం పోటీ చేస్తున్న మూడు ప్యానళ్ల అధ్యక్షులతో సమావేశమయ్యారు. వీసీ సూచన మేరకు న్యాయ నిపుణుల తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి జి.సుధాకర్ తెలిపారు.
ఏమిటీ జాబితా? ఎందుకీ వివాదం
ఎన్నికలు ప్రారంభ సమయంలో, నోటిఫికేషన్ విడుదల సమయంలో వర్సిటీలో 1634 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాను అభ్యర్థులకు సంతకం చేసి ఎన్నికల అధికారి అందజేశారు. తాజాగా గురువారం సాయంత్రం హాస్టళ్లలో పనిచేస్తున్న 185 ఉద్యోగుల జాబితాను దీనికి జత చేయాలని సూచిస్తూ వర్సిటీ వీసీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వర్సిటీ ఉద్యోగులకు ఎన్నికలు నిర్వహించడానికి ముందు నెలలో రూ.10 వేతనం నుంచి సేకరించారు. మే నెల వేతనాలు నుంచి 1634 మంది ఉద్యోగులకు దీనిని సేకరించారు. తాజాగా జత చేసిన ఉద్యోగులకు గత నెల వేతనాల నుంచి ఎన్నికల నిధిని సేకరించలేదు. వీరికి సంబంధించిన రూ.1850 డీడీ రూపంలో చెల్లించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగా ఒక ప్యానల్‌కు సంబంధించిన పోటీదారుడే ఈ రుసుం చెల్లించారని వారు ఆక్షేపిస్తున్నారు. సాధారణంగా హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగులకు హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్‌లో మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వర్సిటీ విభాగాలలో పనిచేసే వారికి ఏయూ ఈయూలో ఓటు హక్కు ఉంటుంది. దీనికి విరుద్ధంగా హాస్టళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని పోటీదారులు కోరుతున్నారు.
నామినేషన్ల ఘట్టం ముగిశాక చేర్పులా..
ఇప్పటికే వర్సిటీ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగి సింది. తాజాగా పలువురి ఓట్లు జాబితాలో చేర్చాలనే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలు జరిపించాలి. – బుద్దల తాతారావు, పోటీదారుడు
ఇదెక్కడి న్యాయం
ఉద్దేశపూర్వకంగా కొంతమంది వర్సిటీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వర్సిటీ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని ఎంత మాత్రం సహించేది లేదు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలి. మార్పులు, చేర్పులు అనుమతించరాదు. – నీలాపు శివారెడ్డి, పోటీదారుడు
ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు..
వర్సిటీలో పనిచేస్తున్న ఎంటీఎస్‌లో కొంత మంది ఉద్యోగులకు గత నెలలో ఎన్నికలకు సంబంధించిన రూ.10 వేలు వేతనం కోత జరగలేదు. దీంతో వీరంతా ఈ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి వారికి ఓటు హక్కు కల్పించారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా డిజిగ్నేషన్ ఇవ్వకుండా లాస్ట్ గ్రేడ్ కేటగిరీ అంటూ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఇటీవల ఎంటీఎస్ పొందిన వారిలో కొంత మందికి ఓటు హక్కు కల్పించి, మరికొంత మందికి మొండి చేయి చూపడం ఎంత వరకు సమంజసం.
– డాక్టర్ జి.రవికుమార్, పోటీదారుడు
Comments
Please login to add a commentAdd a comment