గ్రేటర్‌లో నల్లా, విద్యుత్ బకాయిలు రద్దు
హైదరాబాద్ ప్రజలకు రూ.423 కోట్ల 'ఎన్నికల' కానుక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ సర్కారు అక్కడి ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏకంగా రూ. 423 కోట్ల నల్లా, విద్యుత్ బిల్లుల బకాయిల రద్దుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారికంగా ఈ నిర్ణయం వెలువరించడం సాధ్యం కాదని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్ నగర పరిధిలోని మంత్రులకు స్పష్టం చేశారు. కోడ్ ముగిసిన వెంటనే ఈ నిర్ణయాలను ప్రకటించి, అమలు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావు తదితరులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. నగరంలోని చాలా మంది పేదలు యాభై, వందలోపు యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారని... పేదవారు కావడంతో బిల్లులు చెల్లించలేకపోతున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వంద యూనిట్లకు పైగా విద్యుత్ వాడుకుంటున్న వారు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. దీంతో ముఖ్యమంత్రి అప్పటికప్పుడు విద్యుత్ అధికారులను పిలిపించి మాట్లాడారు.
హైదరాబాద్‌లో దాదాపు ఆరు లక్షల మంది విద్యుత్ వినియోగదారులు దాదాపు రూ. 128 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని.. చాలా కాలం నుంచి ఈ బకాయిలు పేరుకుపోయాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆ బకాయిలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇక నగరంలో మూడు లక్షల కుటుంబాలు పేదరికం కారణంగా తాగునీటి నల్లాల బిల్లులు చెల్లించలేకపోయాయని మంత్రులు సీఎంకు తెలిపారు. దీంతో జల మండలి అధికారుల నుంచి సంబంధిత వివరాలు తెప్పించగా... ఈ బకాయిలు దాదాపు రూ. 295 కోట్ల వరకు ఉన్నట్లు తేలింది. వాటిని కూడా రద్దు చేయాలని సీఎం సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నల్లా, విద్యుత్ బకాయిల రద్దుపై ఉత్తర్వులు జారీ చేయలేమని.. కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రులకు చెప్పారు. మంచినీరు, విద్యుత్ సరఫరా అత్యవసర మౌలిక సదుపాయాలని, వాటిని లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో ప్రభుత్వం ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
లక్షలాది కుటుంబాలకు లబ్ధి..
నీటి, విద్యుత్ బకాయిల మాఫీతో లక్షల కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. నల్లా బిల్లులు బాకీ పడిన సుమారు 3 లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది. విద్యుత్ బకాయిల మాఫీతో సుమారు ఆరు లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నట్లు సీపీడీసీఎల్ వర్గాలు తెలిపాయి. జలమండలి పరిధిలో కొన్నేళ్లుగా పేరుకుపోయిన నీటి బిల్లు బకాయిలు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నాయి. అందులో మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలు, సర్కారు కార్యాలయాలు, ఆస్పత్రులు, క్వార్టర్ల బకాయిలే రూ. 300 కోట్లకు పైగా ఉన్నాయి. ఇక నగర పరిధిలోని 1,500 మురికివాడలు, ప్రభుత్వం కేటాయించిన రాజీవ్ గృహకల్ప గృహాల్లో నివాసముంటున్న వారితోపాటు గృహ వినియోగదారులకు సంబంధించి రూ.295 కోట్ల బకాయిలు, వీటిపై రూ. 150 కోట్ల వరకు వడ్డీ బకాయిలు ఉన్నాయి. మొత్తంగా 8.64 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా.. నీటి బిల్లులు చెల్లించని వినియోగదారులు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా.
విద్యుత్ బకాయిలు ప్రభుత్వానివే
జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా... అందులో 33.5 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు, ఐదు లక్షలకుపైగా వాణిజ్య, 40 వేల వరకు పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ సిబ్బంది ప్రతి నెలా బిల్లులు వసూలు చేస్తున్నారు. వరుసగా ఒకటి రెండు నెలలు బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తున్నారు. పాతబస్తీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రతి నెలా 90-95.5 శాతం బిల్లులు వసూలవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆస్పత్రులు, వీధిలైట్లు, వాటర్‌బోర్డుల విద్యుత్ బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉంటున్నాయి. ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు ప్రకటించిన బకాయిల్లో ఎక్కువ శాతం ప్రభు త్వ సంస్థలవే ఉండనుండడం గమనార్హం.
పేదలకు నీళ్లు, విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి
'హైదరాబాద్ నగరంలో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా నల్లా నీళ్లు, కరెంటును సరఫరా చేయాలి. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత. బకాయిల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మాఫీ ప్రయోజనాలు సంపన్నులకు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఎవరూ బిల్లులు చెల్లించరు..'
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి