రేపటి నుంచి తెలంగాణ స్ఫూర్తి యాత్ర
టీయూవీ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ లక్ష్యంతో తెలంగాణ ఉద్యమ వేదిక (టీయూవీ) తెలంగాణ స్ఫూర్తి యాత్ర తలపెట్టింది. టీయూ వీ కన్వీనర్ డా.చెరుకు సుధాకర్ నేతృత్వంలోని ఈ యాత్రను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి యాత్ర చేపడుతున్నామని నిర్వాహకులు చెప్పారు.
ఉద్యమ జేఏసీ నిర్మాణం కోసం...
గతేడాది మేలో ఏర్పాటైన టీయూవీ ఇప్పటికే వివిధ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా టీజేఏసీకి ప్రత్యామ్నాయ గొంతుకగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావొస్తున్నా, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న వారి కుటుంబాలు, జైళ్లకు వెళ్లిన వారికి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విపరీత ధోరణులు మింగుడు పడడం లేదని టీయూవీ బాధ్యులు పేర్కొంటున్నారు. తె లంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులపై ఇంకా అనేక కేసులు కొనసాగడం, 1969 ఉద్యమకారులను పట్టించుకునే నాథుడే లేకపోవడం వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లి వివరించే ప్రయత్నం ఈ యాత్ర ద్వారా చేయనున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యాలయాలు, యూనివర్సిటీలు నిరాదరణకు గురవుతున్నాయన్నది వీరి వాదన. మరో వైపు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి హామీ పూర్తిగా పట్టాలు ఎక్కపోవడం, కేజీ టు పీజీ ఉచిత విద్య కేవలం సన్న బియ్యం సరఫరాకే పరిమితం కావడం వంటి విషయాలపైనా యాత్రలో చర్చించనున్నారు.
‘గ్రామ స్థాయిలో సంఘటితమైన జేఏసీ, ఇక రాష్ట్రం వచ్చింది కదా అని చేష్టలుడిగి కూర్చోకుండా తెలంగాణ ఉద్యమ జేఏసీగా పరిపుష్టం కావాల్సిన అవసరం ఉంది. ఉద్యమ, సామాజిక శక్తుల పునరేకీకరణ జరగాల్సి ఉంది. ఈ కదలిక ఏ అధికార పార్టీకో, ప్రతిపక్ష పార్టీకో ఎదురు దెబ్బ కావాలని కాదు. దెబ్బతిన్న సబ్బండ కులాలు అన్ని విషయాలు చర్చించడానికి, తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దారులు వెదకడానికే. నిన్నటి గ్రామ జేఏసీ రేపటి రాష్ట్ర ఉద్యమ జేఏసీగా నిలబడితే అనేక మార్పులకు పునాది పడుతుంది’ అని టీయూవీ కన్వీనర్ చెరుకు సుధాకర్ చెప్పారు.
యాత్ర షెడ్యూలు
ఈనెల 14న హైదరాబాద్, భువనగిరి, 15న నల్లగొండ, సూర్యాపేట, 16న ఖమ్మం, 17, 18 తేదీల్లో వరంగల్, 22న సిద్దిపేట, కరీంనగర్, 23న పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, 24న మంచిర్యాల, జగిత్యాల, 25న ఆర్మూ రు, నిజామాబాద్, 28న వికారాబాద్, పరిగి, 29న మహబూబ్‌నగర్‌లలో స్ఫూర్తి యాత్ర జరుగుతుంది. 30న హైదరాబాద్ ఉస్మానియా యూరివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ ఉంటుంది.