నగరంలో తెలంగాణ– కేరళ సాంస్కృతిక ఉత్సవం
25 నుంచి మూడు రోజులపాటు భారీ సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ– కేరళ ప్రభుత్వాలు సంయుక్తంగా నగరంలో పైత్రుకోత్సవం పేరుతో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు నాంపల్లి తెలుగు లలితకళాతోరణంలో ఈ కార్యక్రమాలుంటాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ, కేరళ సాంస్కృతిక, పురావస్తు, రాజ్యాభిలేఖన శాఖలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
రెండు రాష్ట్రాల నృత్య విన్యాసాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, విద్యార్థు లకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు, సంప్రదాయ వంటకాల ఘుమఘుమలు, పురస్కారాలు పొం దిన మలయాళీ చలనచిత్ర ప్రదర్శనలు... ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉంటాయి. గెలుపొందిన వారికి ఉచితంగా కేరళ పర్యటన అవకాశాలు కూడా వరిస్తాయి. ఈ వివరాలను బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి చందూలాల్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంలు వివరించారు. ఈ ఉత్సవాల్లో ప్రదర్శన కోసం కేరళ నుంచి భారీ సంఖ్యలో కళాకారుల బృందం నగరానికి వస్తోందని తెలిపారు.
కేరళ ప్రభుత్వంతో కలసి ఇలాంటి భారీ సాంస్కృతికోత్సవాలను నిర్వహించటం ఇదే తొలిసారన్నారు. ఉత్సవాల అనంతరం తెలంగాణ కళాకారుల బృం దం కేరళకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తుందన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కళాకారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఇచ్చిన ప్రదర్శనలకు మంచి స్పందన వచ్చిందని, మరిన్ని రాష్ట్రాల బృందాలు తెలంగాణకు రావటానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.
త్వరలో కశ్మీర్‌కు తెలంగాణ బృందాలు
త్వరలో తెలంగాణ బృందాలు కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తాయన్నారు. కేరళకు విదేశీ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నందున వారిలో కనీసం 20 శాతం మందిని తెలంగాణకు మళ్లించగలిగితే విదేశీ పర్యాటకుల సంఖ్య సులభంగా 10 లక్షలకు చేరుకుం టుందని వెంకటేశం చెప్పారు. ఈ దిశగా విజయం సాధించేందుకు ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక సంచాలకులు హరికృష్ణ, కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలుగు మలయాళీ అసోసియేషన్స్ అధ్యక్షులు బెంజిమన్‌లు కూడా పాల్గొన్నారు.