'మీ తప్పిదం వల్లే ఆ ఆలస్యం'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్లే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఆలస్యమైందని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 2014 వరకు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌లో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని, అయినా అప్పుడే ఎందుకు ప్రాణహిత ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లు పెంచలేదని ప్రశ్నించారు. తెలంగాణలోని 16 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ చేస్తున్నామని చెప్పారు. గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహారాష్ట్రతో ప్రాజెక్టుల విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ల అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రంగారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కేవలం మొబలైజేషన్, సర్వేల పేరిట 125 కోట్లు వసూలు చేసి.. అసలు పనులకు మాత్రం రూ. 26 కోట్లు ఖర్చు చేశారని, ఇది రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ అని ఆయన ఎద్దేవా చేశారు.