
వాళ్లేమీ చిన్న పిల్లలు కాదు: కేటీఆర్
హైదరాబాద్: ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్న నేతలంతా చిన్న పిల్లలేమీ కాదని తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సచివాలయంలో శుక్రవారం మంత్రులు టి.పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
నాయకులను ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నామంటూ వస్తున్న వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులకు ఆకర్షితులై, ప్రజల అభిమతం మేరకే వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వస్తున్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే కోతలు లేని విద్యుత్ అందించామన్నారు. హైదరాబాద్ చుట్టూ 78 కిలోమీటర్ల పొడవునా 400కేవీ విద్యుత్ లైన్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ... స్వచ్చ హైదరాబాద్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. నగరంలో నీటి సమస్య కొత్తగా వచ్చినదేం కాదని, దీన్ని పరిష్కరించడం కోసం సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేస్తున్నారని తలసాని చెప్పారు.