సాక్షి, హైదరాబాద్: ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలతో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వచ్చేవారం భేటీ అవుతారు. పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా నియమితులైన పలువురు నేతలు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు ఉమ్మడి జిల్లాల మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను కలుస్తూ తమకు సహకరించాల్సిందిగా కోరుతూ వస్తున్నారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేతలెవరూ ఇప్పటివరకు బాధ్యతలు స్వీకరించలేదు. పార్టీ అధినేత కేసీఆర్‌తో త్వరలో జరిగే భేటీ తర్వాతే జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్, వరంగల్ మినహా మిగతా చోట్ల పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని మాత్రమే సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి కావడంతో పార్టీ కొత్త జిల్లా అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షులతో జరిగే భేటీలో జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలు ప్రత్యేకించి జిల్లా స్థాయిలో సోషల్ మీడియా కమిటీల బలోపేతం వంటి అంశాలపై జిల్లా అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా...
జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలను పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపైనా కేసీఆర్ సూచనలు చేస్తారు. జిల్లా కార్యాలయాల ప్రారంభం తర్వాత సంస్థాగత శిక్షణ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, విభజన హామీల్లో మొండిచేయిపై క్షేత్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కూడా జిల్లా అధ్యక్షుల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఉన్నా హైదరాబాద్ జిల్లా కార్యాలయాన్ని కూడా వేరుగా నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుల సమావేశంలో స్థలం కేటాయింపు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. రాష్ట్ర అవతర ణ తర్వాత తొలిసారిగా గత నెలలో 33 జిల్లాలకు అ ధ్యక్షుల పేర్లను ఖరారు చేయగా, వీరిలో ఇద్దరు ఎం పీలు, 19 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల తో పాటు మరో 9 మంది నేతలకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష పదవులు దక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment