
‘ఎర్రగడ్డ’లోనే..
కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం
* ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మాణం
* మానసిక చికిత్సాలయ స్థలంలో అసెంబ్లీ, మండలి
* రెండూ ఒకే భవనంలో.. మధ్యలో సెంట్రల్ హాల్
* సచివాలయంలో తూర్పుముఖంగా సీఎం కార్యాలయం
* ఢిల్లీలోని సౌత్, నార్త్ బ్లాక్ తరహాలో నిర్మాణం
* రెండువైపులా మంత్రులు, అధికారుల కార్యాలయాలు
* పక్షంలో తెలంగాణ సంప్రదాయ ఆకృతిలో నమూనా సిద్ధం
* ఆ వెంటనే టెండర్ల కసరత్తు... వీలైనంత తొందరలో పనులు
* ఆర్ అండ్ బీ అధికారులతో ఆర్కిటెక్ట్ హఫీజ్ సిబ్బంది భేటీ
సాక్షి, హైదరాబాద్
కొత్త సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణంలోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఆ ఆసుపత్రిని ఆనుకునే ఉన్న మానసిక వ్యాధుల చికిత్సాలయ స్థలాన్ని కూడా సేకరించి అందులో శాసనసభ, శాసనమండలి భవనాలను నిర్మించాలని కూడా నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మేరకు పచ్చజెండా ఊపారు. దాంతో ఈ నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన చర్యలను అధికారులు ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా భవన నమూనాలను రూపొందించనున్నారు. వీటిని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సిద్ధం చేయనున్నారు.
ఆయన సంస్థకు చెందిన సభ్యులు బుధవారం రోడ్లు భవనాల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. మొత్తం ఎన్ని విభాగాలు, ఎంతమంది సిబ్బంది, ఎన్ని వాహనాల సామర్థ్యంతో కూడిన పార్కింగ్ అవసరం, అసెంబ్లీ, మండలి అవసరాల వంటి వివరాలు సేకరించారు. ఈ విషయంలో హఫీజ్‌కు గతంలోనే సీఎం స్వయంగా దిశానిర్దేశం చేశారు. అప్పట్లో హఫీజ్ మూడు డిజైన్లు రూపొందించగా వాటికి ఆయన కొన్ని మార్పులు సూచించారు. ఆ మేరకు పక్షం రోజుల్లో కొత్త నమూనాలు రూపొందించనున్నారు. వాటికి సీఎం ఆమోదం లభిస్తే ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ మొదలు పెడతారు. నెల రోజుల్లో పనులకు శ్రీకారం చుట్టాలని యంత్రాంగం భావిస్తోంది.
విమర్శలకు వెనకడుగు... మళ్లీ అదే వేగం...
ప్రస్తుత సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉందని సీఎం గతంలో స్వయంగా పేర్కొనడం తెలిసిందే. విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దాంతోపాటు కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండాలనే ఉద్దేశాన్ని కూడా వ్యక్తీకరించారు. ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించి ఆ స్థలంలో కొత్త సచివాలయం నిర్మించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. దానిపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. ప్రస్తుత సచివాలయం బాగా ఉన్నప్పటికీ వాస్తు పేరుతో కొత్తది నిర్మించడమంటే ప్రజాధనాన్ని వృథా చేయడమేనంటూ విపక్షాలతో పాటు సాధారణ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవడంతో అప్పట్లో సీఎం దాన్ని పక్కనపెట్టేశారు.
ఈ లోపు సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానాన్ని పరిశీలించారు. కానీ, దానికి మార్కెట్ ధర ప్రకారం డబ్బులివ్వాలని రక్షణ శాఖ కోరడంతో దాన్ని పక్కన పెట్టారు. తర్వాత ఆయన ఇక కొత్త సచివాలయం మాటే ఎత్తకపోవడంతో తరలింపు యోచనను విరమించుకున్నారని భావించారు. కానీ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని తుది నిర్ణయం తీసుకున్నట్టు ఇటీవల రోడ్లు భవనాల శాఖ అధికారులతో బడ్జెట్ సమీక్ష సందర్భంగా వారికి వెల్లడించారు. ఆ వెంటనే హఫీజ్ సిబ్బంది వచ్చి డిజైన్ల రూపకల్పనకు రంగంలోకి దిగారు.
నిర్మాణాలిలా...
- దాదాపు 48 ఎకరాల స్థలంలో విస్తరించిన ఛాతీ వ్యాధుల ఆసుపత్రి స్థలంలో దాదాపు 8 అంతస్తులతో సచివాలయ భవనం నిర్మిస్తారు. ఢిల్లీలో కేంద్రప్రభుత్వ సచివాలయ భవనం తరహాలో సౌత్, నార్త్ బ్లాక్ తరహాలో నిర్మాణం ఉంటుంది. మధ్యలో తూర్పుముఖంగా సీఎం కార్యాలయం ఉంటుంది. దానికి రెండు వైపులా ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాలుంటాయి. సీఎం కార్యాలయం ఎదురుగా ఉద్యానవనాలతో కూడిన ఖాళీ స్థలముంటుంది. ప్రతి శాఖకు సంబంధించిన మంత్రీ, కార్యదర్శీ, సంబంధిత సిబ్బందీ అంతా ఒకేచోట ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు.
- ఛాతీ ఆస్పత్రి పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయం తాలూకు 40 ఎకరాల స్థలంలో అసెంబ్లీ, మండలి కోసం ఒకే భవనం నిర్మిస్తారు. వాటిని అనుసంధానిస్తూ సెంట్రల్ హాల్ నిర్మిస్తారు.