సచివాలయానికి దాదాపు ఖరారైన నమూనా ఇదే
సాక్షి, హైదరాబాద్: ఆ భవన నమూనాను చూడగానే అమెరికా పరిపాలన ప్రధాన కార్యాలయం వైట్‌హౌజ్ గుర్తుకు వస్తుంది.. కానీ అది పక్కా డెక్కన్ కాకతీయ శైలిలో అలరారుతుంది. అదే ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న తెలంగాణ సచివాలయ భవనం. సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ రూపొందించిన నమూనాను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ నమూనా ముఖ్యమంత్రి కేసీఆర్ అమితంగా ఇష్టపడే గుమ్మటం ఆకృతులతో అలరారనుంది.
ఆరు అంతస్తుల్లో, విశాలమైన పాలరాతి నిర్మాణంలా అనిపించే అందమైన భవంతి. ముందు నుంచి చూస్తే 11 గుమ్మటాలతో కూడిన గమ్మత్తయిన రాచఠీవీ దాని సొంతం. భవనం మధ్య భాగంలో పైన ఎత్తయిన ప్రధాన గుమ్మటం, దాని దిగువన అటూఇటూ మరో రెండు చిన్న గుమ్మటాలు. భవనానికి రెండు వైపులా మరో రెండు పెద్ద గుమ్మటాలు.. వాటికి రెండు వైపులా రెండు చొప్పున పహారా కాస్తున్నాయా అన్నట్టు మరో నాలుగు, ప్రధాన గుమ్మటానికి ద్వారపాలకుల్లా మరో రెండు.. వెరసి 11 గుమ్మటాల సమ్మిళితంగా ఆ భవనం ఔరా అనిపిస్తుంది.
భవనానికి ముందు నీటిని విరజిమ్ముతూ స్వాగతం పలికే భారీ వాటర్ ఫౌంటెయిన్.. దాని ముందు సగర్వంగా జాతీయ పతాకాన్ని ఉంచే జెండా దిమ్మె. దానికి రెండు వైపులా 20 చొప్పున విశాలమైన మెట్లు ఉండే రెండు మార్గాలుంటాయి. పైకి వెళ్లిన తర్వాత భవనంలోకి వెళ్లేందుకు మరో భారీ మెట్ల మార్గం ఉంటుంది.
సీఎం కార్యాలయానికి ప్రత్యేక మార్గం
భవనం ఆరు అంతస్తుల్లో (జీ ప్లస్ 5)ఉంటుంది. ప్రవేశద్వారం వద్ద ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉంటుంది. ప్రధాన ప్రవేశద్వారం రెండు మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ముందువైపు భవనం మధ్యలో ‘తెలంగాణ’ను ప్రతిబింబించే చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నారు. భవనం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మంత్రులు, పేషీలు, కార్యదర్శుల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా తీర్చిదిద్దనున్నారు.
పచ్చదనానికి ప్రాధాన్యం
ప్రస్తుత సచివాలయ ప్రాంగణం 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. కొత్త భవనానికి 20 శాతం స్థలం కేటాయించారు. మిగతా ప్రాంతంలో పచ్చిక బయళ్లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. హరిత తెలంగాణ మదిలో మెదిలేలా పచ్చటి సచివాలయం ఇక్కడ ఆవిష్కృతం కానుంది. మొత్తం స్థలంలో 60 శాతం పచ్చిక ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఫ్రాన్స్‌లోని వెసాయ్‌ల్స్ ప్యాలెస్ ముందున్న ఉద్యానవనం తరహాలో ఈశాన్యం, ఆగ్నేయం వైపు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మధ్యలో భారీ ఫౌంటెయిన్ కూడా ఉంటుంది. దీన్ని తెలంగాణ పుష్పం తంగేడు ఆకృతిలో రూపొందించనున్నారు.
గ్రీన్‌బిల్డింగ్ కాన్సెప్ట్..
ప్రపంచవ్యాప్తంగా భారీ నిర్మాణాలను పర్యావరణహితంగా నిర్మిస్తున్నారు. నూతన సచివాలయం భవనం విషయంలో కూడా గ్రీన్‌బిల్డింగ్ కాన్సెప్ట్‌ను అవలంభిస్తున్నారు. సహజ వెలుతురు ఎక్కువగా భవనంలోకి చొరబడేలా చేయటం ద్వారా లైట్ల అవసరాన్ని తగ్గించనున్నారు. ఇక వీలైనంతమేర సౌర విద్యుత్తును వాడనున్నారు. ఇందుకోసం భవనం పై భాగంలో సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు. సహజ వెలుతురు పెరగ్గానే లైట్లు వాటంతట అవే కాంతిని తగ్గించుకునేలా, అవసరమైతే ఆరిపోయేలా ఆటోమేటిక్ విధానంతో అనుసంధానిస్తారు. భవనంలోనికి సహజ గాలి ధారాళంగా వచ్చేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం సచివాలయంలో దాదాపు 200 వరకు చెట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి. వాటిని అలాగే కాపాడుతూ, నిర్మాణానికి అడ్డుగా ఉన్న కొన్నింటిని ట్రాన్స్ లొకేట్ చేయాలని నిర్ణయించారు.
800 కార్లతో భారీ పార్కింగ్ లాట్
సచివాలయం అనగానే నిత్యం వేల మంది సందర్శకులు వస్తుంటారు. వీరి వాహనాలు నిలిపేందుకు భారీ పార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంలో పనిచేసే మంత్రులు, అధికారులకు సంబంధించి 500 కార్లు నిలిపేలా, సందర్శకులకు సంబంధించి మరో 300 కార్లు ఇక్కడ నిలిపే ఏర్పాట్లు ఉంటాయి. తొలుత సెల్లార్ పార్కింగ్ అనుకున్నా... తర్వాత విరమించుకుని ఉపరితలంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత సచివాలయంలో దేవాలయం, మసీదు ఉన్నాయి. వాటిని కొత్త సచివాలయంలో కూడా నిర్మించనున్నారు. సిబ్బందికి సంబంధించి చిన్న పిల్లల కోసం క్రెచ్, బ్యాంకు, పోస్టాఫీసు.. తదితర ఏర్పాట్లు ఉంటాయి.
చాలా గర్వంగా ఉంది: ఆస్కార్ జి. కాన్సెస్సో, ఆర్కిటెక్ట్
దేశంలోనే వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి డిజైన్ రూపొందించే అవకాశం రావటం చాలా గర్వంగా ఉందని డిజైన్ రూపొందించిన చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్టస్ అధిపతి ఆస్కార్ జి.కాన్సెస్సో పేర్కొన్నారు. తన భార్య పొన్ని జి.కాన్సెస్సోతో కలిసి ఆయన ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. వినూత్న నిర్మాణాలకు డిజైన్లు రూపొందించటంతో ఈ సంస్థ మంచి ఖ్యాతిని పొంది ఇప్పటివరకు దాదాపు 100కుపైగా పురస్కారాలు అందుకుంది. తాజాగా తెలంగాణ సచివాలయ నమూనా రూపొందించే కాంట్రాక్టును దక్కించుకుంది.
తిరిచురాపళ్లి నిట్‌లో ఈ దంపతులు బి.ఆర్క్ డిగ్రీ పొంది ఆ తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేసి ఆర్కిటెక్ట్ సంస్థను ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనానికి డిజైన్ రూపొందించే అవకాశం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ లాంటి వారితో పోటీపడి అవకాశం దక్కించుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి ఆశించేస్థాయిలో డిజైన్లు అందించాం. పచ్చిక బయళ్లతో సహా కలిపి మొత్తం 15 డిజైన్లు ఇచ్చాం. వాటిని పరిశీలించి చివరకు అత్యద్భుత నమూనాను ఎంచుకున్నారు. పూర్తి ఆధునిక హంగులుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment