
చులకనగా చిత్రీకరిస్తే క్రిమినల్ కేసులు..
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో పోలీసు పాత్రలను చులకనగా చిత్రీకరిస్తే పరువు నష్టం, క్రిమినల్ కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. సమాజంలో పరువు ప్రతిష్టలు కలిగిన పోలీసులను సినిమాల్లో చులకనగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు వై.గోపిరెడ్డి మాట్లాడారు. సినిమాలో పోలీసు పాత్రధారులు చొక్కాలు విప్పడం, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక నుంచి తమను కించపరిచే పదాలు ఉపయోగిస్తే కేసులు పెడతామని స్పష్టం చేశారు.
ఖాకీలు, పోలీసోడు వంటి పదాలు ఉపయోగించినా సహించబోమన్నారు. ఇటీవలి కాలంలో ‘మెంటల్ పోలీస్’ పేరుతో తీస్తున్న సినిమాను పేరు మార్చాలని లీగల్ నోటీసులు పంపినా వారి నుంచి స్పందన రాలేదని.. వారిపై న్యాయస్థానంలో పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లు గోపిరెడ్డి తెలిపారు. అలాగే ‘పోలీసోడు’ అనే సినిమా పేరును మారుస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు హామీ ఇచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా సినిమాల్లో తెలంగాణ పోలీసు యూనిఫాం, లోగోలను ఉపయోగించి గౌరవించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు ఎన్.శంకర్‌రెడ్డి, సైబరాబాద్ అధ్యక్షులు సీహెచ్ భద్రారెడ్డి పాల్గొన్నారు.