
సాక్షి, విజయవాడ: స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబ అవినీతిపై విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్‌ఎస్పీ గనులు, పశుగ్రాసం కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. కోడెల శివప్రసాద్ ట్యాగ్( కేఎస్టీ) పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 72 ప్యాకేజీల కింద పనులను విభజించి టెండర్లు నిర్వహించారని, తమకు అనుకూలమైన వారికే టెండర్ ఫారంలు ఇచ్చారని మండిపడ్డారు. కోడెల కుమారుడి నేతృత్వంలో అందరూ కలిసి రింగ్‌గా మారారని, 25 నుంచి 30 శాతం అధికంగా కోట్ చేశారన్నారు. 5 శాతం అధికం వేస్తే రివ్యూ కమిటీకి పంపుతారు.. కానీ అంతకన్నా అధికంగా వేసినా రివ్యూ కమిటీకి పంపలేదని తెలిపారు. టెండర్లు ఓపెన్ చేయకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. నీటి పారుదల శాఖలో ఇది నిదర్శనమని, కాంట్రాక్టర్‌లు, అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వంద కోట్ల పనుల్లో భారీగా అవినీతి జరుగుతోందన్నారు.
మరో వైపు పశుగ్రాసం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయన్నారు. 3500 ఎకరాల్లో గడ్డిని పెంచాలని, వాటిని కొనుగోలు చేయాలని నిర్ఱయించారన్నారు. పుశుసంవర్థక శాఖ ద్వారా టీడీపీ అనుయాయులు పేర్లతో గడ్డి కొనుగోళ్లు జరుపుతున్నారన్నారు. ఒక్కో ఎకరానికి ఇరవై వేల చొప్పున ఏడు కోట్ల రూపాయలు స్వాహా చేశారని తెలిపారు. అసలు ఏ రైతు తన పొలంలో గడ్డి పెంచారో చెప్పాలన్నారు. మొక్కజొన్న గడ్డలు, గడ్డి కలిపి సైలేజ్‌ను తయారు చేస్తున్నారని, కేంద్రం దీనికి 50 శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. కోడెల కుమార్తె విజయలక్ష్మి సైలేజ్ యంత్రాలను పెట్టి ఈ సబ్సిడీని కాజేస్తున్నారని వెల్లడించారు. పశువులు తినలేని సైలేజ్‌ను వీరు తయారు చేసి, బలవంతంగా రైతులకు అంటగడుతున్నారని మండిపడ్డారు. కోడెల కుటుంబం చేస్తున్న అవినీతి హెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు ఓ శాఖను, కుమార్తె ఓ శాఖను పంచుకుని అవినీతి పాల్పడుతున్నారని తెలిపారు. స్పీకర్‌గా ఉన్న కోడెల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. తన కుమార్తె, కుమారుడి అవినీతికి కోడెల బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment