టెట్, ఎంసెట్ వాయిదా | telangana tet, eamcet exams postponed | Sakshi
Sakshi News home page

టెట్, ఎంసెట్ వాయిదా

Published Fri, Apr 29 2016 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

టెట్, ఎంసెట్ వాయిదా

టెట్, ఎంసెట్ వాయిదా

తనిఖీలపై విద్యాసంస్థల సహాయ నిరాకరణతో ప్రభుత్వ నిర్ణయం
మే 20లోగా నిర్వహించేలా చర్యలు:  ముఖ్యమంత్రి కేసీఆర్

 
సాక్షి, హైదరాబాద్: మే 1వ తేదీన జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), మే 2వ తేదీన జరగాల్సిన ఎంసెట్ పరీక్షను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే టెట్, ఎంసెట్‌లను బహిష్కరిస్తామని ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, ప్రైవేటు విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న బెదిరింపులకు లొంగేది లేదని, తనిఖీలు జరిగి తీరుతాయని స్పష్టంచేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉపాధ్యాయుల పర్యవేక్షణతో, ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన సిబ్బందితో టెట్, ఎంసెట్‌లను మే 20వ తేదీలోగా నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఆదేశించారు. టెట్, ఎంసెట్‌ను బహిష్కరిస్తామని ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం రాత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.

ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఆయా ప్రైవేటు విద్యా సంస్థల్లోనే ఉన్నందున పరీక్షల వాయిదాకు నిర్ణయం తీసుకున్నారు. నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్, నీట్ పరీక్షల అంశంపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎంసెట్‌కు దరఖాస్తులు స్వీకరించిన అంశంతోపాటు పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్న విషయాన్ని కేంద్రంతో చర్చించాలన్న ఆలోచనకు వచ్చారు. ఈ భేటీ తర్వాత సమావేశంలో చర్చించిన అంశాలను వివరిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
 
బోగస్‌లను ఏరేస్తాం..
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పరిస్థితిని చూసి చలించామని, అందుకే తనిఖీలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రైవేటు విద్యాసంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగానే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ విద్యా సంస్థలను ఏరి వేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని పునరుద్ఘాటించారు. అయితే ఈ చర్యలను.. ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీగా చెప్పుకుంటున్న వారు వ్యతిరేకించడాన్ని సీఎం తప్పు పట్టారు.

విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనిఖీలు నిర్విహ ంచకుంటే ఏ విద్యాసంస్థ ఎలా నడుస్తోంది? ప్రమాణాలు పాటిస్తున్నారా? ఎవరైనా తప్పులు చేస్తున్నారా? అన్న విషయాలు ఎలా తెలుస్తాయని సీఎం అన్నారు. విద్యా వ్యవస్థను నీరుగార్చేలా ప్రైవేటు విద్యా సంస్థల ప్రవర్తన ఉందని, ఇది సరికాదని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తనిఖీలు విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతాయని, ఇందులో అనేక సంస్థలు భాగస్వామలుగా ఉంటాయని తెలిపారు. థర్డ్ పార్టీగా బిట్స్ పిలానీ, ట్రిపుల్‌ఐటీ లాంటి సంస్థలు కూడా ఉంటాయని వెల్లడించారు. నాణ్యత ప్రమాణాల పెంపు కోసం తనిఖీలు జరిపించి తీరుతామని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కడియంను ఆదేశించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement