పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
Published Thu, Feb 2 2017 3:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే ఉద్యోగాల కోసం.. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కోచింగ్ తీసుకున్న యువత ఇంటికి వెళ్ళలేక.. ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు తెలియ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు.
ఈ నెల 22 న నిరుద్యోగులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులతో కలిసి సభ నిర్వహిస్తామని చెప్పారు. నిరుద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పోలీసుల తీరు సరిగా లేదన్నారు. జేఏసీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడడం శోచనీయమన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి ఎన్నో చూశాం.. మేము భయపడేవాళ్లం కాదన్నారు. సమాజంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు.. ఇది పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలు వేచి చూశాం.. ఉద్యోగాల విషయంలో ఎక్కువ కాలం వెయిట్ చేస్తే వయసు అయిపోతుందన్నారు. ఉద్యోగాలపై చర్చకు జేఏసీ సిద్ధంగా ఉందన్నారు.
Advertisement