కేసీఆర్ ఒప్పందాల మతలబు ఏంటో?
హైదరాబాద్ : మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల మతలబు ఏంటో బయటపెట్టాలని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలన్నీ బూటకమేనని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. బ్యారేజీల ఎత్తు ఎందుకు తగ్గించారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏంసాధించారని పటాసులు కాల్చి, సంబరాలు చేసుకుంటున్నారన్నారు.
రైతుల నోట్లో మట్టి కొట్టవద్దని, వారిని ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు...ప్రత్యేక విమానంలో వెళ్లారని .. ఈ ఒప్పందాల వల్ల ఒరిగిందేమిటో చెప్పాలన్నారు. ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ చేసుకున్నది చారిత్రత్మక ఒప్పందం అని చెప్పడం విడ్డూరంగా ఉందని కొండా రాఘవరెడ్డి అన్నారు.
మరోవైపు వరంగల్ జిల్లా పరకాలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని అన్నారు. దోషులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. వైఎస్ఆర్ విగ్రహం తొలగించడం వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హస్తముందన్నారు. నిందితుల విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని అన్నారు.