మహానందం
బడ్జెట్‌లో గ్రేటర్‌కు అగ్రతాంబూలం
జీహెచ్‌ఎంసీకి రూ.628 కోట్లు
జంట పోలీసు కమిషనరేట్లకు రూ.1112 కోట్లు
జలమండలికి రూ.1000.11కోట్లు
మెట్రో రైలుకు రూ.416 కోట్లు
హెచ్‌ఎండీఏకు రూ.596.25 కోట్లు
మైనార్టీల సంక్షేమం,అభివృద్ధికి రూ.550 కోట్లు
పెన్షన్లు, సంక్షేమం, సామాజికాభివృద్ధికి రూ.219 కోట్లు
నగరంలోని విశ్వవిద్యాలయాలకు రూ.583.21 కోట్లు
ఎంఎంటీఎస్ రెండోదశకు రూ.20.83 కోట్లు
{పభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులకు రూ.520 కోట్లు
సిటీబ్యూరో: గ్రేటర్‌పై నిధుల వాన కురిసింది. అభివృద్ధి ‘భాగ్యం’ దక్కనుంది. ఈటెల బడ్జెట్ సిటీజనుల్లో మహానందాన్ని నింపింది. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది. తాను కలలుగంటున్న విశ్వనగరం వైపు హైదరాబాద్‌ను నడిపించే దిశగా సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులకు బడ్జెట్ అద్దం పట్టింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి నిధులు దక్కడంతో వివిధ విభాగాల పరిధిలో అభివృద్ధి పథకాలు శరవేగంగా ముందుకు సాగనున్నాయి. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం, జీహెచ్‌ఎంసీ పరిధిలో మంచినీటి సౌకర్యానికి సింహభాగం నిధులు కేటాయించారు. దీంతో శివారు దాహార్తి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరంలో పౌర పాలనకు కేంద్రంగా ఉన్న జీహెచ్‌ఎంసీకి సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.628 కోట్లు దక్కాయి. హైదరాబాద్, సైబరాబాద్ జంట పోలీసు కమిషనరే ట్ల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నిఘా కెమెరాల ఏర్పాటు...ఇతర సౌకర్యాలకు రూ.1112 కోట్లు కేటాయించారు.
మెట్రో ప్రాజెక్టుకు రూ.416 కోట్లు, మైనార్టీల అభ్యున్నతికి రూ.550 కోట్లు, నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి రూ.583.21 కోట్లు, ఎంఎంటీఎస్ రెండోదశకు రూ.20.83 కోట్లు కేటాయించారు. సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యపరికరాల కొనుగోలుకు రూ.520 కోట్లు కేటాయించడం ద్వార ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్టుసర్కారు ప్రకటించింది. మొత్తంగా మహా నగరంలోని వివిధ విభాగాలకు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు.. వాటిపై నిపుణుల విశ్లేషణలు
జీహెచ్‌ఎంసీపై నిధుల వర్షం
తెలంగాణ ఆవిర్భావం తరువాత... టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ నగర ప్రజల్లో కొత్త ఆశలు రేపింది. గడచిన మూడేళ్లతో పోలిస్తే నిధుల కేటాయింపు మెరుగ్గానే ఉంది. స్లమ్ ఫ్రీ సిటీ పథకానికి రూ.250 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లోనూ దీనికి రూ.250 కోట్లు కేటాయించారు. మొత్తంగా రూ.500 కోట్లు కేటాయించినట్లయింది. హరిత తెలంగాణకు రూ.25 కోట్లు కేటాయించారు. మిగతా అంశాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాల్లేవు. ప్రణాళిక, ప్రణాళికేతర నిధులకు గత రెండు బడ్జెట్లలో వరుసగా రూ.215 కోట్లు, రూ.370 కోట్లు కేటాయించగా... ఈసారి ఆ సంఖ్య రూ.628 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్ కంటే అదనంగా రూ.258 కోట్లు పెరిగింది.
ఆశాజనకమే అయినా..
జీహెచ్‌ఎంసీకి కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ... గ్లోబల్‌సిటీకి వివిధ పనులు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలకు అనుగుణంగా మరిన్ని నిధులు ఇస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరద కాలువల ఆధునికీకరణకు రూ.10 వేల కోట్లు.. రోడ్లకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తొలిదశలో రహదారులకు రూ.250 కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కైవేలు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, మల్టీ గ్రేడ్ సెపరేటర్లు వంటివి నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ... జీహెచ్‌ఎంసీకి కేటాయించిన నిధుల్లో వీటి ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఆస్తిపన్నుగా రూ.20 కోట్లు రావాల్సి ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ విలేకరులకు చెప్పారు.
త్వరలో జీహెచ్‌ంఎసీ బడ్జెట్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా...
రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు తెలియడంతో ఇక జీహెచ్‌ఎంసీ నిధులతో చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టి సారించారు. ఏటా రాష్ట్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు లేకపోవడం.. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నప్పటికీ పనులు జరగకపోవడం తెలిసిందే. దీంతో ఈసారి వాస్తవిక బడ్జెట్‌ను రూపొందించాలనే యోచనలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ఉన్నారు. దాదాపు రూ. 5వేల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. వచ్చేవారం ముసాయిదా బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సోమేశ్ కుమార్ విలేకరులకు తెలిపారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా వివిధ పథకాలు, పనులకు నిధులు కేటాయిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీకి రూపాయి రాక.. పోక వివరాలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా పారదర్శకంగా వ్యవహరిస్తామన్నారు.
జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఇదే ప్రథమం
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే ప్రథమం. మున్నెన్నడూ లేని విధంగా ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి ప్రాధాన్యమివ్వడం ఆనందంగా ఉంది. స్లమ్‌ఫ్రీలో భాగంగా కేటాయించిన నిధులతో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తాం. ప్రజోపయోగమైన అభివృద్ధి పనులను జీహెచ్‌ఎంసీ నిధులతో చేపడతాం.
-సోమేశ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్