కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మల్ జిల్లాలో ప్యాకేజీ–27,28 పనులపై గురువారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనల మధ్య కొనసాగింది.
పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలి: కాంగ్రెస్, బీజేపీ
నిర్మల్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మల్ జిల్లాలో ప్యాకేజీ–27,28 పనులపై గురువారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళనల మధ్య కొనసాగింది. పాలక, ప్రతిపక్షాల వాగ్వాదాలు, తోపులాటలతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.కలెక్టర్ ఇలంబరిది అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ ఈఈ భిక్షపతి అభిప్రాయాలు స్వీకరించారు. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ నాయకులు వేదిక వద్ద ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న రైతులు, ప్రజలకు పరిహారం ఇవ్వకుండానే పనులు ఎలా చేపట్టారంటూ నిలదీశారు.
ఇంతలో పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేస్తూ వేదిక దగ్గరికి వచ్చారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న సమ యంలో అధికార పక్ష నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులు మధ్య తోపులాట జరిగింది. గొడవ సద్దుమణగక పోవడంతో కలెక్టర్ పోలీసుల సాయంతో కాంగ్రెస్ నాయకులను బయటకు పంపించారు. బీజేపీ నాయకులు తమ వాణి వినిపించి సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపో యారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.