‘అగ్గిపుల్ల’తో బాంబులు! | terrorists reveled to NIA how they make explosives | Sakshi
Sakshi News home page

‘అగ్గిపుల్ల’తో బాంబులు!

Published Sun, Jan 24 2016 5:09 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

‘అగ్గిపుల్ల’తో బాంబులు! - Sakshi

‘అగ్గిపుల్ల’తో బాంబులు!

- పేలుడు పదార్థాల తయారీలో ఉగ్రవాదుల వి‘నూతన’ పంథా

- హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్ఫరస్‌పై దృష్టి పెట్టిన ఐసిస్

- ఎప్పటికప్పుడు పంథా మారుస్తున్న ముష్కర మూకలు

- విచారణలో కీలక విషయాలు వెల్లడించిన ముష్కరులు

 

సాక్షి, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్‌మెంట్ తేలికైపోయినా విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. ఐసిస్ స్ఫూర్తితో, ఆ సంస్థ కనుసన్నల్లో ఏర్పాటైన జుందుల్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థ మాత్రం ఈ వ్యవహారంలోనూ తెలివిగా వ్యవహరించింది.

 

రొటీన్‌కు భిన్నంగా, సాంప్రదాయేతర ‘విధ్వంస’వనరులపై దృష్టి పెట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకున్నది ఈ ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులనే! హైదరాబాద్‌లో శుక్రవారం అదుపులోకి తీసుకున్న నలుగురిలో మరో ఇద్దరిని శనివారం అరెస్టు ప్రకటించిన ఎన్‌ఐఏ, వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఢిల్లీకి తరలించింది. శుక్రవారం రాత్రి ముష్కరుల్ని విచారించిన అధికారులు అనేక కీలకాంశాలు సేకరించారు.

 

ఆర్డీఎక్స్ నుంచి అమ్మోనియం నైట్రేట్

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు, పాక్ ప్రేరేపిత సంస్థలకు చెందిన ముష్కరులు మన దేశంలో పాల్పడ్డ బాంబు పేలుళ్లకు ఎక్కువగా ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని వాడేవారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్లు మొదలుకుని అనేక ఘటనల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విధ్వంసాలకు వాడే ఆర్డీఎక్స్ నేరుగా పాకిస్తాన్ నుంచే సరఫరా అయ్యేది. ఇది ముప్పని భావించిన పాక్, దేశవాళీ ఉగ్రవాద సంస్థ అయిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దగ్గరకు వచ్చేసరికి... పేలుడు పదార్థాలను స్థానికంగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. దాంతో ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్‌కు మారారు. 2007, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లలో ఐఎం ఉగ్రవాదులు వాడింది దీన్నే!

 

నిఘాకు ఏమాత్రం చిక్కకుండా

జుందుల్ అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థ పేలుడు పదార్థాల సమీకరణలో మరో అడుగు ముందుకు వేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించే ప్రయత్నం చేసినా నిఘాకు చిక్కే ప్రమాదముందనే అనుమానంతో రూటు మార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ పదార్థాలనే పేలుడు పదార్థాలుగా వినియోగించడంపై సుదీర్ఘ అధ్యయనమే చేసింది.

 

ఈ మాడ్యుల్‌లో ఉన్న విద్యాధికులు ఇంటర్నెట్‌లో పరిశీలించి, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్ఫరస్‌లను బాంబుల తయారీకి ఎంచుకున్నారు. అగ్గిపుల్లల్లోనూ, టపాసుల్లోనూ విసృ్తతంగా వాడటమే గాక మార్కెట్‌లో తేలిగ్గా దొరుకుతాయి గనక ఎవరికీ అనుమానం రాదని ఈ మార్గం పట్టారు. మంగళవారం హరిద్వార్‌లో చిక్కిన రూర్కీకి చెందిన అఖ్లాల్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ ఒసామా, మహ్మద్ అజీం షా, మెహ్రోజ్‌ల వద్ద భారీగా అగ్గిపుల్లలు, శుక్రవారం పట్టుకున్న ఉగ్రవాదుల వద్ద హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరకడానికి ఇదే కారణమని ఓ ఎన్‌ఐఏ అధికారి వెల్లడించారు.

 

‘అల్జీరియా’ స్ఫూర్తితో పేరు

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ మాడ్యూల్ కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం నౌఫాల్ నేతృత్వంలో ఏర్పాటైందని నిఘా వర్గాలు తొలుత భావించినా, దీనితో అతనికి సంబంధం లేదని శుక్రవారం రాత్రి నిందితులు వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోందంటున్నారు. ముంబైకి చెందిన మునబీర్ ముస్తాఖ్ నేతృత్వంలో జుందుల్ మాడ్యూల్ ఏర్పాటైనట్లు నిర్ధారించారు.

 

ఇతడు ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పాటైన అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) ఇన్‌చార్జ్ షఫీ ఆర్మర్  (సిరియాలో ఉన్నాడు) కనుసన్నల్లో పని చేస్తున్నట్లు తేల్చారు. ఏడాదిన్నర క్రితమే ఈ మాడ్యూల్ ఏర్పాటు చేసిన మునబీర్.. అల్జీరియా కేంద్రంగా అల్ కాయిదా, ఐసిస్‌లకు అనుబంధంగా పని చేస్తున్న జుందుల్-అల్-ఖలీఫా అల్జీరియా స్ఫూర్తితో ఈ పేరు పెట్టాడు. ఖలీఫా రాజ్య స్థాపన కోసం పోరాడే సైన్యం అని దీని అర్థం. భారత్‌కు సంబంధించినది గనుక పేరులో ‘హింద్’ను చేర్చాడు.

 

అబు, ఒబేద్ సైతం అరెస్టు

ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 12 చోట్ల దాడులు చేసి 14 మందిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌లో చిక్కిన నలుగురిలో నగరానికి చెందిన మహ్మద్ నఫీస్ ఖాన్, మహ్మద్ షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్‌లను శుక్రవారమే ఎన్‌ఐఏ అరెస్టు చూపింది. మిగతా ఇద్దరైన టోలిచౌకి ఎండీ లైన్స్‌కు చెందిన కంప్యూటర్ పాయింట్ నిర్వాహకుడు మహ్మద్ ఒబేదుల్లా ఖాన్, మాదాపూర్‌కు చెందిన అబు అన్స్‌లను శనివారం అరెస్టు చేసినట్లు ప్రకటించింది.

 

ఈ నలుగురినీ నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాధాకృష్ణమూర్తి ఎదుట హాజరుపరిచింది. మంగళవారం నాటికి ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరు పరిచేందుకు వీలుగా పీటీ వారెంట్ తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు నలుగురినీ శనివారం ఢిల్లీ తరలించారు. రాజస్థాన్‌లోని టోంక్ ప్రాంతానికి చెందిన అబు అన్స్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. ఎంసీఏ పూర్తి చేసిన ఇతడు అబిడ్స్‌లో ‘ఇంటర్నేషనల్’ అనే సంస్థలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. మీడియాతో తన కుమారుడు నిరపరాధి అని ఇతడి తండ్రి అంజద్ టోంక్‌లో మీడియాతో అన్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement