రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ప్రస్తుత పాలక మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ జీవో నెంబర్19ను జారీ చేశారు. రాష్ట్ర హస్తకళల అభివృధ్ధి సంస్థ ఎండీని టెస్కో పర్సన్ ఇన్‌చార్జిగా నియమించారు. 2018 మార్చి వరకు ప్రస్తుత పాలక మండలి సభ్యుల పదవీ కాలం ఉంది. అయితే పాలక మండలి సభ్యులు, చైర్మన్ నియామకం రాజకీయాలతో ముడిపడి ఉండటంతో.. రద్దు ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేయడంతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రణాళికకు గత ఏడాది ఆగస్టులో షీలా బిడే కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 2015 అక్టోబర్ 31 న ఆవిర్భవించిన తెలంగాణ చేనేత సహకార సంఘం (టెస్కో) సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆప్కో పాలక మండలిలో 24 మంది డెరైక్టర్లుగా ఉండగా.. విభజన ప్రణాళిక మేరకు తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13 మంది డెరైక్టర్లను కేటాయించారు. వీరందరూ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఫిబ్రవరిలో నియమితులు కాగా.. 16 మార్చి 2018 వరకు పదవీ కాలం ఉంది. కాగా, పాలక మండలి విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతమున్న పాలక మండలిని రద్దు చేసి.. నూతన పాలక మండలిని నియమించాలంటూ ప్రభుత్వంపై కొందరు డెరైక్టర్లు ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త పాలకమండలి నియామకంపై అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నారు. అక్కడి నుంచి సమ్మతి రావడంతో తాజా ఉత్తర్వులు జారీ అయినట్లు తెలిసింది.