
ఆ గొంతు చంద్రబాబుదే!
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఖమ్మం: ‘గతంలో ఎన్నో సందర్భాల్లో ఏపీ సీఎం చంద్రబాబుతో నేను ఫోన్‌లో మాట్లాడాను. ఓటుకు నోటు వివాదం లో లభించిన ఆడియో టేప్‌లో ఉన్న గొంతు చంద్రబాబు దే.. అందులో ఎలాంటి సందేహం లేదు.’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు సాధించాలని సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభ సోమవారం ఖమ్మంలో జరిగింది. సభలో తమ్మినేని మాట్లాడారు.
ఆ ఆడియో రికార్డు విషయం మాట్లాడకుండా టీడీపీ నేతలు ఫోన్ టాంపరింగ్‌పై కేసులు పెట్టాలని ఆందోళనకు దిగడం శోచనీయం అన్నారు. మరోవైపు రూ. 50 లక్షలు ఎమ్మెల్సీకి ఇస్తూ అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తప్పుచేశానని పశ్చాత్తాపం పడకుండా.. మీసం వెలివేయడం, నేనొక్కడినే దొంగనా అని వాగ్వాదానికి దిగడం ప్రజాస్వామ్యానికే మచ్చ అన్నారు.
ముందుగా రూ. 50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయో తేల్చాలని అన్నారు. ఆ ఆడియోగొంతు చంద్రబాబుది కాకపోతే బాస్ ఎవ్వరో.. బాబుగారు ఎవ్వరో.. అందులో ఉన్నది ఎవ్వరో చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల ముందు లెక్కలేనన్ని వాగ్దానాలు చేసిన సీఎం కేసీఆర్ గెలిచిన తర్వాతవాటిని విస్మరించారని విమర్శించారు.