వినాయక నిమజ్జన శోభాయాత్ర అనంతరం ఇంటికి వెళ్తున్న యువకుడిపై పది మంది వ్యక్తులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ సైట్-3 పెద్దమ్మనగర్‌లో నివాసముండే పి. చంద్రశేఖర్(32) యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో భార్యతో కలిసి నిమజ్జన శోభాయాత్ర నుంచి ఇంటికి వస్తుండగా పది మంది యువకులు శేఖర్ అంటూ పేరు పెట్టి పిలిచారు. దీంతో వెనక్కి తిరిగిన శేఖర్‌ను అప్పటికే కర్రలతో సిద్ధంగా ఉన్న యువకులు చితక బాదారు. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడికి పాల్పడ్డారు.
ఈఘటనలో శేఖర్‌కు తీవ్ర గాయాలు కాగా వెంటనే శ్రీనగర్‌కాలనీలోని నిఖిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అకారణంగా దాడి చేసిన అదే బస్తీకి చెందిన వీరేశం, రఘు, సాయి, చిట్టి, శివ తదితరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.
దాడిచేసిన వారిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ప్రశాంతంగా జరుగుతున్న శోభాయాత్రలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కూడా సీరియస్‌గా ఉన్నారు.